తెలుగు హీరోయిన్లను మన పరిశ్రమ ప్రోత్సహించదు అనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. కాస్త తెల్లతోలు కనిపించి, ఉత్తారాది భామ అయితే ఆమెకి విమానపు ఖర్చులు, ఫైవ్‌స్టార్ హోటళ్లు, కోట్లాది రెమ్యూనరేషన్స్, వారు కోరే గొంతెమ్మ కోర్కెలు, ఆమె స్టాఫ్ కి కూడా సకల మర్యాదలు జరగాల్సిందే. దాంతో మన హీరోయిన్లు పరభాషల వైపు మొగ్గుచూపుతున్నారు. మన మేకర్స్ దీనికి చెప్పే కారణం ఏమిటంటే.. తెలుగమ్మాయిలకు క్రమశిక్షణ తక్కువ. వారు సినిమాని ఓ ప్రొఫెషన్‌గా తీసుకోరు. కాస్త ఎక్స్‌పోజింగ్ అంటే నో అంటారు. ఇక ఇక్కడి అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకోవాలంటే దర్శకనిర్మాతలే వచ్చి తమ తల్లిదండ్రులను ఒప్పించమంటారు అని సమాధానం చెబుతారు. ముంబై వెళ్లితే వందల మంది సిద్దంగా ఉన్నప్పుడు తెలుగమ్మాయిను బతిమాలేది ఎందుకు? అంటారు.
ఇక నాటి రేఖ నుంచి నేటి అంజలి వరకు ఇలా ఇతర భాషల్లో పేరు తెచ్చుకున్నవారే. ఇక ఒకప్పుడు తెలుగులో పండుగా పిలవబడి, స్టార్ హీరోలతో నటించిన టబు, ఆమె అక్క ఫరా ది కూడా హైదరాబాదే. కాగా ఇప్పుడు ఈ జాబితాలోకి వచ్చిన భామ ఆదితీరావు హైదరి. ఈమె ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో ముంబై వెళ్లి, బాలీవుడ్ మోడలింగ్‌లో చేసింది. 2006లో ఆమె నటించిన తమిళ చిత్రం 'శృంగారం' చిత్రంలో దేవదాసి పాత్రలో మంచి నటన కనబర్చింది. అయినా దక్షిణాదిలో ఆమెకు ఆఫర్లు రాలేదు. దాంతో ఆమె బాలీవుడ్‌లో లవ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'యహ్ సాలీ జిందగీ', మ్యూజికల్ హిట్ అయిన 'రాక్‌స్టార్', హర్రర్ థ్రిల్లర్ 'మర్డర్3 ', రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కూబ్‌సూరత్', మెలో డ్రామాగా వచ్చిన 'ఫితూర్' చిత్రాలలో నటించింది. ప్రస్తుతం సంజయ్‌దత్ హీరోగా నటిస్తున్న 'భూమి', దీపికాపడుకోనే, సంజయ్‌లీలాభన్సాలీల 'పద్మావతి' చిత్రాలలో నటిస్తోంది. ఇక మణిరత్నం చేతుల్లో పడటమే ఆమె అదృష్టంగా చెప్పారు. కార్తి, ఆదితిరావు హైద్రిలతో తీసిన 'చెలియా' బాగా ఆడకపోయిన మణిరత్నం పుణ్యమా అని ఎంతో అందంగా కనిపించింది. దాంతో మరోసారి కార్తి ఆమెకు తన సినిమాలో చాన్స్ ఇవ్వనున్నాడు.
ఇప్పుడు తెలుగులో ఆమెకి మంచి అవకాశం వచ్చింది. శ్రీదేవి మూవీస్ పతాకంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా రూపొందనున్న చిత్రంలో ఆమెకి చాన్స్ వచ్చింది. ఇంద్రగంటితో పనిచేసిన హీరోయిన్లు బాగా బిజీ అవుతారనే సెంటిమెంట్ ఉంది. అదే ఆదితారావు హైదరికి కూడా తెలుగులో మంచి గుర్తింపును తెస్తుందనే భావించాలి.. ! ఇక ఆమె వనపర్తి సంస్థానానికి చెందిన యువతి. ఈమె పూర్వీకులు రాజులు అన్న విషయం కొందరికి మాత్రమే తెలుసు.