నటి రమ్యకృష్ణ.. ఈమె కెరీర్‌లో ఎన్నో చిత్ర విచిత్రాలు ఉన్నాయి. ఆమె తొలినాళ్లలో చేసిన 'సంకీర్తన, సూత్రధారులు' వంటి చిత్రాల తర్వాత ఆమెను ఐరన్‌లెగ్ అన్నారు. నాడు ఓన్లీ డీగ్లామరైజ్‌డ్ క్యారెక్టర్లని ఆమెకి ఇచ్చేవారు. కానీ రమ్యకృష్ణలోని గ్లామర్ కోణాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెలికి తీశారు. 'అల్లుడుగారు' నుంచి ఆమె ఇమేజ్‌నే మార్చేశాడు. ఇక ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన 'ఆయనకిద్దరు' చిత్రంలో ఆమె లేడీ విలన్‌గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అదరగొట్టింది. కానీ ఆమెలోని మరోనటనా కోణాన్ని చూపించిన చిత్రం రజనీకాంత్ నటించిన 'నరసింహ' చిత్రంలోని 'నీలాంబరి' పాత్ర, రజనీ వంటి దిగ్గజ స్టార్ సరసన ఆయనకు పోటీగా, రజనీ స్టైల్‌ని డామినేట్ చేసే విధంగా ఆమె పోషించిన నెగటివ్ టచ్ ఉన్న పాత్ర ఆమె నటనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
ఇక ఏ ముహూర్తాన 'బాహుబలి' చిత్రంలో శ్రీదేవికి బదులు రమ్యకృష్ణని తీసుకున్నారో గానీ ఈ పాత్రను రమ్యకృష్ణ తప్ప ఎవ్వరూ చేయలేరని, చివరకు శ్రీదేవి కూడా అలా నటించలేదనే పేరును తెచ్చుకుంది. ఇది నిజంగా క్రమక్రమంగా మసకబారుతున్న ఆమె కెరీర్‌కి పెద్ద బూస్టప్‌ని ఇచ్చింది. దాంతో దీనిని రీఎంట్రీగా కూడా పలువురు దీనిని అభివర్ణిస్తున్నారు. ఇక తాజాగా ఈమెలోని వీరావేశం చూపిస్తూ 'బాహుబలి'లో ఆమె పాత్ర పేరైన 'శివగామి' అనే పేరునే టైటిల్‌ని పెట్టి కన్నడలో ఓ చిత్రం తీస్తున్నారు. తెలుగులో నాలుగైదు చిత్రాలను నిర్మించిన గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇది ఆయనకు తొలి కన్నడ చిత్రం కావడం విశేషం.
ఇక దీనికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం బాధ్యతలను మధు నిర్వర్తిసున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక కీలకమైన చివరి షెడ్యూల్ కోసం మహారాణి పాత్రలో రమ్యకృష్ణని చూపిస్తూ భారీ సెట్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ ఫోటోలో రమ్యకృష్ణ స్టిల్‌ని చూస్తే ఎవరైనా సరే మరోసారి 'శివగామి' తిరిగి వచ్చిందా? అనే ఆశ్యర్యం కలిగిస్తోంది. ఇక ఈ సినిమాకి క్రేజ్ రావడం కోసమే 'శివగామి' అనే టైటిల్‌ని పెట్టారని స్పష్టమవుతోంది. కాగా ఈచిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ చేయనున్నారు. మరి ఆమెలోని నటనను ఈ యూనిట్ ఎలా బయటికి వెలికి తీస్తుందో వేచిచూడాల్సివుంది..!