ఎంతో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను కూడా తెలుగు పరిశ్రమ సరిగా ఆదరించదనే విమర్శలున్నాయి. దాంతో తెలుగులో నటించిన వారే కోలీవుడ్‌కో మరో వుడ్‌కో వెళ్లి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు. విశాల్, ఆది పినిశెట్టి, వైభవ్‌లతో పాటు నాటి సాయికుమార్, చియాన్ విక్రమ్‌లు కూడా అంతే. మొదట్లో కొన్ని తెలుగు చిత్రాలలో నటించిన విక్రమ్ బాల తీసిన 'శివపుత్రుడు' ద్వారా తన నటనా ప్రతిభ ఏమిటో లోకానికి చాటాడు. ఆ తర్వాత ఆయన నటించిన 'అపరిచితుడు' నుంచి ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి.
ఇక లేటు వయసులో హీరోగా ఛాన్స్ రావడంతో ఆయనకు హీరో వయసు ఉన్న కుమారుడు, పెళ్లీడు వచ్చిన అమ్మాయి ఉన్నారంటే అందరూ ముక్కున వేలేసుకున్నారు. తనదైన శైలిలో పాత్ర కోసం ఎంతకైనా తెగించే విక్రమ్‌లోని విలక్షణ నటుడిని కేవలం మొదట తమిళులే గుర్తించారు. ఇక ఈయనకు తమిళనాడులో మంచి ఫాలోయింగ్, కమల్‌హాసన్ తర్వాత మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఆయన తెలుగులో అఖండ విజయం సాధించిన 'అర్జున్‌రెడ్డి' తమిళ రీమేక్‌లో తన కుమారుడు దృవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తనకు నటునిగా జన్మనిచ్చిన బాల దర్శకత్వంలో తన కుమారుడిని పరిచయం చేస్తున్నాడు.
ఇక ఆయన కుమార్తెకి తాజాగా డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ముని మనవడితో వివాహం జరిపించాడు. ఈ జంట ప్రేమించుకోవడంతో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో కేవలం విక్రమ్ సన్నిహిత బంధువులు, కరుణానిధి అప్తులతో కరుణానిధి ఇంట్లోనే సింపుల్‌గా పెళ్లి చేశారు. తాజాగా రిసెప్షన్‌ని భారీగా నిర్వహించారు. ఈ వేడుకలో విక్రమ్ తన గొంతు సవరించుకుని ఇళయరాజా సంగీతంలో వచ్చిన అద్భుతగీతాలను ఆలపించి, వేడుకకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. గతంలో 'మల్లన్న' వంటి చిత్రాలలో కూడా విక్రమ్ పాటలు పాడిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆయన 'స్కెచ్, ధృవనక్షత్రం, సామి 2' చిత్రాలతో బిజీగా ఉన్నాడు.