ఎంతో కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్ అన్ని 'ఆ.. నలుగురి' చేతిలోనే ఉన్నాయని చిన్న సినిమాల నిర్మాతలు ధ్వజమెత్తుతున్నారు. నిజంగానే చిన్న చిత్రాలకు థియేటర్స్ విషయంలో అన్యాయం జరుగుతోంది. కానీ 'అర్జున్‌రెడ్డి' తాజాగా 'పీఎస్వీగరుడవేగ' వంటి చిత్రాలకు కూడా మొదట్లో చాలా తక్కువ థియేటర్స్ మాత్రమే వచ్చాయి. పోటీలో అల్లుఅరవింద్‌కి చెందిన 'నెక్ట్స్‌నువ్వే' కూడా ఉండటం 'పీఎస్వీగరుడవేగ'కి ఇబ్బందిగా మారింది. కానీ సినిమాకి పాజిటివ్ రెస్సాన్స్ వచ్చి, మౌత్‌టాక్ కూడా తోడవ్వడంతో మొదట తక్కువ థియేటర్లలో విడుదలైన 'అర్జున్‌రెడ్డి, పీఎస్వీ గరుడవేగ'లను ఎన్నో థియేటర్లను కేటాయించి, బయ్యర్లు, ఎగ్జిబ్యూటర్సే తమ థియేటర్లలోకి ఆ సినిమాని తెచ్చుకున్నారు.
ఇక విషయానికి వస్తే మంచు మోహన్‌బాబు రెండో తనయుడు మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న 'ఒక్కడు మిగిలాడు' చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించకుండా కేవలం డబ్బింగ్ చిత్రాలైన నాలుగు సినిమాలకే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారని నైజాంలోని ఏషియన్ థియేటర్స్ అధినేత సునీల్‌తో ఈ చిత్రం దర్శకుడు అజయ్ వాగ్వాదానికి దిగాడు. సునీల్ తమ చిత్రానికి థియేటర్లు ఇవ్వడం లేదని అజయ్ ఆయనతో గొడవకు దిగడంతో సునీల్ మాట్లాడుతూ, వంద మంది రౌడీమూకలను వెంటవేసుకుని వచ్చి తనను థియేటర్లు ఇవ్వాలని అజయ్ బెదిరించాడని ఆయన ఆరోపించారు. చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయని అన్నింటికీ థియేటర్స్ కేటాయించాలని, రౌడీయిజం చేస్తే థియేటర్లు రావని తేల్చి చెప్పాడు.
ఇక ఇక్కడ డబ్బింగ్ చిత్రాలకే థియేటర్లు కేటాయిస్తున్నారని అజయ్ ఆరోపిస్తున్నాడు. మరి ఆయన చిత్రం తమిళంతో పాటు పలు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరి ఆయా భాషల్లో 'ఒక్కడు మిగిలాడు' చిత్రం పరాయి భాషా చిత్రమే అవుతుంది కదా..! ఇక ఈ విషయంలో మోహన్‌బాబు రికమండేషన్ కూడా పనిచేయడం లేదు. మోహన్‌బాబుకి అల్లుఅరవింద్, సురేష్‌బాబు, దిల్‌రాజులతో పాటు ఎవరితో సత్సంబంధాలు లేవు. దాసరి బతికున్నంత కాలం ఆయన ద్వారా రికమండేషన్స్ చేయించుకున్న మోహన్‌బాబుని ఇప్పుడు పట్టంచుకునే వారు లేరని, ఆయన కుమారుడి చిత్రం విషయం చూస్తేనే అర్ధమవుతుంది.