తరచు వివాదాలతో సహవాసం చేసే లోకనాయకుడు కమల్‌హాసన్ తాజాగా హిందూ తీవ్రవాదం పేరుతో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయనపై హిందు మత అభిమానులు, పీఠాధిపతుల నుంచి పలువురు ఆగ్రహంగా ఉన్నారు. ఇక కమల్‌ని కాల్చివేసినా తప్పులేదని అఖిల భారత హిందు మహాసభ ఉపాధ్యక్షుడు అశోక్‌శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమల్‌పై క్రిమినల్, పరువు నష్టం కేసులు పెట్టాలని భావించిన పిటిషన్‌ని వారణాశి కోర్టు విచారణకు స్వీకరించింది. మరోవైపు ఈ వ్యాఖ్యలను మరో నటుడు అరవింద్‌స్వామి సమర్ధించారు. చట్ట విరుద్దంగా బెదిరించి, హింసకు పాల్పడే వారిని ఉగ్రవాదులు కాక ఏమనాలి? ఈ విషయంలో కమల్‌కి నా మద్దతు ప్రకటిస్తున్నాను. 'మెర్శిల్' చిత్రానికి కూడా నా మద్దతు ఉంటుందని స్వామి వ్యాఖ్యానించాడు.
కాగా తన రాజకీయ పార్టీ, ఇతర జెండా, అజెండా వంటి విషయాలన్నింటినీ త్వరలో వెల్లడిస్తానని కమల్ మీడియాకు తెలిపాడు. తన పుట్టినరోజైన ఈనెల 7వ తేదీన అభిమానులెవ్వరూ వేడుకలు నిర్వహించవద్దని, వరద బాధితులకు సాయం చేయాలని ఆయన సూచించారు. అభిమానులతో 50 విభాగాలుగా సమావేశాలు ఏర్పాటు చేస్తానని, పార్టీ ప్రకటనతో పాటు అన్ని విషయాలు చాలా సింపుల్‌గా, నిరాడంబరంగా జరుపుతానని తేల్చిచెప్పాడు. దీంతో ఆరు నెలలుగా కమల్ రాజకీయ ఎంట్రీపై సాగుతున్న చర్చకు ఈ మాటల ద్వారా కమల్ స్పష్టతనిచ్చాడు.
అయితే నేడు చాలా మంది తాము నాస్తిక వాదం, హిందు వ్యతిరేక జపం చేస్తూనే మేధావులుగా గుర్తించబడతామని, తమ పబ్లిసిటీకి అది దోహదం చేస్తుందనే భావనలో ఉన్నారు. కంచె ఐలయ్య, కమల్‌హాసన్, ఓవైసీ వంటి వారు ఇదే మార్గంలో నడుస్తున్నారు. హిందువులనే కాదు.. ఏ మతాన్నైనా ఎందుకు తిట్టాలి? వారి మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలి? గుడిసె కాలుతుంటే చుట్ట వెలిగించుకునే తరహాలో ఎందుకు వీరు మాట్లాడుతున్నారు? అనేదే అసలు ప్రశ్న....!