జీవితంలో ఎత్తు పల్లాలు, కెరీర్‌లో ఆటుపోటులు సహజమే. అదే నేడు రాజశేఖర్ విషయంలో జరిగింది. ఆయనతో 30కోట్లతో సినిమానా? అని ఎగతాళి చేసిన వారే ఆయన్ను నేడు ఎంతో మెచ్చుకుంటున్నారు. ప్రవీణ్‌సత్తార్ ఈ చిత్రం కథ చెప్పిన తర్వాత ఆయన తీసిన చిత్రాలు చూసి నాకు నమ్మకం వచ్చింది. 15ఏళ్లుగా హాలీవుడ్ యాక్షన్ చిత్రం వంటిది చేయాలని అడుగుతున్నా.. అందరూ చూద్దాం.. చేద్దాం అంటున్నారు. నా పరిస్థితి బాగాలేదు. ఆ సమయంలో కోటేశ్వరరాజు మా నాన్న ఫ్రెండ్‌గా పరిచయమయ్యాడు. ఆయన్ను ప్రవీణ్‌సత్తార్‌కి పరిచయం చేశాను. ఆయన నిర్మాతతో ఏడెనిమిది కోట్లతో తీద్దామా? లేక 30కోట్లలో తీద్దామా? అని అడిగారు. సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న కోటేశ్వరరాజు గారు మీ ఇష్టం. అందరికీ గుర్తుండిపోయే చిత్రం చేద్దామని అనడంతో ఇంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది.
ఆమద్య నా సినిమాలు ఫ్లాప్ కావడంతో రాజశేఖర్ క్యారెక్టర్ రోల్స్, విలన్‌గా కూడా నటిస్తారని వార్తలు రాశారు. దాంతో చాలా మంది విలన్‌గా చేయమన్నారు. కానీ గుర్తుండిపోయే పాత్రే ఉండాలని నేనుచెప్పాను. నిజానికి హీరో అంటే అందంగా నవ్వాలి. అందంగా కనిపించాలి వంటి నిబంధనలు ఉంటాయి. కానీ విలన్‌గా చేయడం చాలా ఈజీ. దీనికి పెద్దగా నిబంధనలు ఉండవు. ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'జెంటిల్‌మేన్' ఆఫర్ ముందు నాకే వచ్చింది. కానీ అదే సమయంలో 'అల్లరిప్రియుడు' షూటింగ్‌లో ఉన్నాను. అందరిలా నేను డేట్స్ అడ్జెస్ట్ చేయలేను. దాంతో దానిని వదులుకున్నాను అని చెప్పుకొచ్చారు హీరో రాజశేఖర్.
ఇక 'పీఎస్వీ గరుడవేగ' చిత్రం డిస్ట్రిబ్యూషన్ విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వలేదు. కోస్తాని సురేష్‌బాబు, సీడెడ్‌ని సాయికొర్రపాటి, నైజాంని మల్కాపురం శివకుమార్ తీసుకున్నారు. కానీ ఫైనాన్స్ తీసుకున్న మూడు కోట్ల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురైతే రాజశేఖర్ తన విలువైన స్థలాన్ని తాకట్టుపెట్టి మరీ విడుదల చేశాడని తెలుస్తోంది. మొత్తానికి ఆయన నమ్మకం నిజమైంది...!