స్టార్స్‌కి కొందరు అభిమానులుంటే మరికొందరు వీరాభిమానులు ఉంటారు. వారు తమ హీరోని ఎవరైనా విమర్శిస్తే ఇక వారి అంతు చూసే దాకా వదలరు. అది ఎదుటి హీరో, లేదా ఎదుటి హీరో ఫ్యాన్స్ ఇలా ఎవరైనా కావచ్చు. దీనికి ఉదాహరణగా పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌ని చెప్పవచ్చు. వారు తమ మెగాహీరోగా భావించి ఎంతో ఎంకరేజ్ చేసిన అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' అనే ఒకే వ్యాఖ్యకి ఆయనకి చుక్కలు చూపిస్తున్నారు. ఇక 'డిజె' వ్యవహారంలో పవన్ అభిమానుల తీరు ఎలా ఉందో మరలా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా తోటి ఇంటి వారినే టార్గెట్ చేసే వారు ఇతర బయటి వ్యక్తులు తమ హీరోని విమర్శిస్తే ఒప్పుకుంటారా? లేదనే చెప్పాలి.
ఇక ఇటీవల పవన్‌కళ్యాణ్‌ని, ఆయన రాజకీయాలను, ఆయన ఐడియాలజీని విమర్శిస్తూ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆయనపై పవన్ అభిమానులు మాటల యుద్దమే కాదు.. ఓ టీవీ చానెల్‌లో లైవ్‌లో చాట్ చేసిన కత్తిమహేష్‌ని చానెల్ స్టూడియో నుంచి నువ్వు బయటికి రా.. చంపేస్తాం.. నరికేస్తామని మాట్లాడారు. ఇది లైవ్‌లో చూసిన వారు వారి ప్రవర్తనకు షాక్ అయ్యారు. కానీ కత్తి మహేష్‌ని ఇప్పటికి కూడా పవన్ అభిమానులు వదలడం లేదు. ఆయన మొబైల్‌కి వస్తున్న వాట్సప్ మేసేజ్‌లలో ఆయనను అసభ్యపదజాలంతో దూషిస్తూ, ప్రాణాలు తీస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో కత్తి మహేష్ ఫేస్‌బుక్‌లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. తన మొబైల్‌ని వాట్సప్ మేసేజ్‌లలో ఉన్న పరుషమైన పదజాలాన్ని ఆయన స్క్రీన్‌షాట్ తీసి దానిని కూడా పోస్ట్ చేశాడు. పవన్ అభిమానుల తీరును తప్పుపడుతూ, ఆయన ఓ మొబైల్ నెంబర్ నుంచి తనని చంపుతామని బెదిరింపు కాల్ కూడా వచ్చిందని, ఆ ఫోన్ నెంబర్‌ని కత్తి మహేష్ పోస్ట్ చేశాడు.
మొత్తానికి ఈ వివాదం తెర మరుగు కాకుండా తానే ఇంకా సెలబ్రిటీని కావాలని ప్లాన్డ్‌గా కత్తి మహేషే ఈ విషయాన్ని సాగదీస్తున్నాడా? లేక పవన్ అభిమానుల తీరే అంతా? మరి బన్నీతో గొడవ విషయంలోనే కాదు.. కత్తి మహేష్ విషయంలో కూడా పవన్ గానీ ఆయన సన్నిహితులు గానీ కల్పించుకుని అభిమానులను శాంతింపజేస్తారా? లేక తమకు తమ అభిమానులే ముఖ్యమని చెప్పి, సామాన్యులకు పవన్ అభిమానులంటే భయభ్రాంతులకు గురయ్యేలా చూస్తూ ఉంటారా? అనేది తేలాల్సివుంది. ఈ విషయాన్ని సాగదీయడం కత్తి మహేష్‌కే కాదు.. పవన్ ఫ్యాన్స్, రాజకీయాలలోకి రానున్న పవన్‌కి మంచిది కాదు.. ఎందుకంటే ఆయన రాజకీయాలలోకి ప్రత్యక్షంగా వస్తే ఇంతకు మించిన విమర్శలను ఆయన ఎదుర్కొవాల్సి వస్తుంది.. రాజకీయాలలో ఇలాంటి బెదిరింపులను మరింత రాజకీయం చేసి పవన్‌ని చెడుగా చూపే ప్రయత్నాలను ఆయన ప్రత్యర్ధులు చేసి, మరింత రాజకీయం చేస్తారనేది ఆయనకు, ఆయన అభిమానులకు తెలియాల్సివుంది...!