ఈ మధ్యన టాలీవుడ్ హీరోలు తరుచూ తమ మధ్యన స్నేహ సంబంధాలను బహిర్గతం చేస్తున్నారు. మహేష్ - రామ్ చరణ్ తమ తమ ఫ్యామిలీస్ తో కలిసి టూర్స్ లో ఎంజాయ్ చేస్తుంటే.. ఇక్కడ ఒక స్టార్ హీరో సినిమాకి మరో స్టార్ హీరో క్లాప్ కొట్టేస్తున్నాడు. అభిమానులు మాత్రమే బయట తన్నుకు చస్తున్నారు గాని... ఇండస్ట్రీలో మాత్రం మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ ఇలా అందరూ స్నేహసంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ 'జై లవ కుశ' ని రామ్ చరణ్ వీక్షించి ఎన్టీఆర్ తో పార్టీ కూడా చేసుకున్నాడు. అలాగే ఎన్టీఆర్ సినిమాకి పవన్ క్లాప్ కొట్టాడు.
అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... రామ్ చరణ్ 'రంగస్థలం 1985' చిత్రం పాటల గురించి మంచు మనోజ్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశాడు. రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో చరణ్, సమంత తో జోడి కడుతుండగా... ఈ చిత్రాన్ని 2018 వేసవి సందర్భంగా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవిశ్రీ సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాటలను రామ్ చరణ్, మంచు మనోజ్ కి వినిపించాడట. ఆ సినిమా పాటలు విన్నప్పటి నుండి తాను అస్సలు ఆగలేకపోతున్నానని... నా సోదరుడు రామ్ చరణ్ 'రంగస్థలం' పాటలు వినిపించినప్పటి నుంచి... అవి నన్ను వెంటాడుతున్నాయి. ఆడియో, సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా. వెంటనే విడుదల చేయండి అంటూ ఇంట్రస్టింగ్ గా ట్వీట్ చేశాడు.
మరి మనోజ్ కి అంతగా 'రంగస్థలం' పాటలు నచ్చాయి అంటే.. మెగాభిమానులకు ఇంకెలా నచ్చుతాయో మీరే అర్ధం చేసుకోండి. ఇకపోతే మంచు మనోజ్ తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు' ఈనెల 10న విడుదలకు ముస్తాబవుతోంది.