సినిమా వారంటేనే చాలు సాధారణ ప్రేక్షకులు, ప్రజల్లో చులకన భావం ఉంది. విచ్చలవిడిగా తెరపై చేసే శృంగారాలు, అర్ధనగ్న దృశ్యాలు, అంగాంగ ప్రదర్శనలు, ఇక నిజజీవితంలో కూడా అలాంటి దుస్తులు, లేట్ నైట్ పార్టీలు, డ్రగ్స్ నుంచి మద్యం వరకు అన్ని అలవాట్లు ఉంటాయని ప్రజలు భావిస్తారు. దానిపై ప్రజలను, ప్రేక్షకులను తప్పు పట్టాల్సిన పనిలేదు. వారు చేసే చేష్టలే వారికి అలాంటి చెడ్డపేరును తెస్తున్నాయి. ఇక ఇటీవల హీరో రాజశేఖర్ హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డులో ఆగి ఉన్న కారును ఢీ కొట్టిన సంఘటన సంచలనం సృష్టించింది. అందరూ ఆయన మద్యం సేవించి కారు నడిపాడేమో అని అనుకున్నారు. కానీ తన తల్లి మరణించిన బాధలో తాను డిప్రెషన్‌కి, నిద్రకు మాత్రలు వేసుకున్నానని, దాంతోనే ఈ ఘటన జరిగిందని రాజశేఖర్ వివరణ ఇచ్చాడు.
తన తల్లి మరణించిందని, స్వయాన డాక్టర్ కూడా అయిన ఆయన నిద్రమాత్రలు, డిప్రెషన్ మందులు వాడి వాహనాన్ని తోలకూడదని, వాటి ద్వారా మత్తు బాగా వస్తుందని ఆయనకు తెలియదా? తన తల్లి చనిపోయిన బాధలో మరింత ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే అది రాజశేఖర్ తప్పు కాదా...! డాక్టర్ అయి ఉండి అలాంటి చిన్న అవగాహన కూడ లేకుండా ఆయన చేసిన పని తప్పు అనే చెప్పాలి. ఇక తాజాగా ఆయన పెద్దకుమార్తె, కాబోయే హీరోయిన్ శివాని కూడా తాజాగా జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి సమయంలో ఆగివున్న కారుని ఢీకొట్టింది. కారు స్పీడ్ వల్ల అదుపు తప్పి ఈ ఘటన జరిగిందని శివాని అంటోంది. అది కూడా ఆగి ఉన్న కారే కావడం, అందులో మనషులెవ్వరూ లేకపోవడం అదృష్టం.
ఇక ఈ ఘటనలో బాధితుడు మాత్రం తాను ఆ కారును కొని కేవలం రెండు నెలలే అయిందని, తనకు 30లక్షల పరిహారం కావాలని కోరుతున్నాడు. ఇక శివాని కూడా ప్రస్తుతం ఎంబిబిఎస్ చదవుతోంది. మరి ఈమె కూడా తన తండ్రి చిత్రం బాగా ఆడుతుండటం, తన తండ్రికి కమ్‌బ్యాక్ మూవీ రావడంతో ఆనందం పట్టలేక నిద్రమాత్రలు వేసుకుందా? లేక ఆ ఆనందంలో మద్యం తాగి నడుపుతోందా? అనేది తెలియదు. కానీ ఈ విషయమై ఇప్పటివరకు పోలీస్‌లకు ఫిర్యాదు అందకపోవడం చూస్తే గొప్పోళ్లు ఏ తప్పు చేసిన డబ్బులతో పలుకుబడితో బయటపడవచ్చని అర్ధమవుతోంది.