ప్రస్తుతం శతదినోత్సవాలే కాదు అర్ధశతదినోత్సవాలు కూడా కరువైపోయాయి. కేవలం మొదటివారంలో మరీ తొలి వీకెండ్‌లో వసూలు చేసే కలెక్షన్లే హీరోల చిత్రాలకు కొలమానంగా మారుతున్నాయి. ఇక సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నా కూడా నిర్మాతలకు ఇప్పుడు కేవలం థియేట్రికల్ వసూళ్లే కాదు.. శాటిలైట్ హక్కులు, డిజిటల్ హక్కులు, ఓవర్‌సీస్, ఆడియో హక్కులు, ఇతర భాషల డబ్బింగ్ హక్కులు, యూట్యూబ్‌ల ద్వారా కూడా నిర్మాతలకు అదనపు లాభాలు వస్తున్నాయి. ఇక ఓ చిత్రాన్ని ఎంత రేటుకి కొనాలి... ? అనేది ఆయా హీరోల హిట్ ట్రాక్, దర్శకుల కమర్షియల్ కోణం, ముఖ్యంగా కాంబినేషన్స్‌ని సెట్ చేయడంతోనే నిర్మాతలకు చాలా భాగం లాభాలను తెచ్చిపెడుతోంది. కొన్ని చిత్రాలు షూటింగ్ స్టేజీలో వారు చేసే ప్రమోషన్స్, ఇతర అంశాల ఆధారంగా రేటు పలుకుతున్నాయి.
అయితే ఇటీవల పవన్, మహేష్ బాబు వంటి వారి డిజాస్టర్స్ వల్ల బయ్యర్లు, నిర్మాతలే కాదు.. ఆయా చిత్రాలను భారీ రేట్‌కి శాటిలైట్ హక్కులు కొన్న చానెల్స్ వారు కూడా నష్టపోతున్నారు. దాంతో సినిమాని కొనే ముందు ఇంత భారీ రేట్లకు శాటిలైట్ హక్కులు కొనడం కరెక్టా? కాదా? అనే చర్చ కూడా నడుస్తోంది. చిన్న సినిమాలను మాత్రం విడుదలైన తర్వాత ఫలితం చూసి కొంటున్న చానెల్స్, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పెద్ద హీరోల చిత్రాలను మాత్రం రిలీజ్‌కి ఎంతో సమయం ఉండగానే భారీ, ఫ్యాన్సీ ఆఫర్స్‌తో సొంతం చేసుకుంటున్నారు.
కాగా ప్రస్తుతం రామచరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రంగస్థలం 1985' చిత్రం శాటిలైట్ హక్కులను ఓ చానెల్ పోటీ పడి మరీ 18కోట్లకు సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఇక నాన్ బాహుబలి రికార్డుగా మొదటి స్థానంలో పవన్-త్రివిక్రమ్‌ల 'అజ్ఞాతవాసి' చిత్రంకి ఏకంగా 21కోట్లకు శాటిలైట్ హక్కుల ద్వారా లభించాయని చెబుతున్నారు. ఇలాంటి ఫిగర్స్ కొన్ని సార్లు సినిమా అంచనాలను పెంచడానికి కూడా తప్పుడు సంఖ్యలను లీక్ చేస్తూ ఉంటారు. వీటిని ఎవరి వద్దా ఆధారాలు ఉండవు. కాబట్టి వార్తలలో వచ్చే ఈ అంకెలనే నిజమని నమ్మాల్సిన పరిస్థితి....!