బాలనటిగా చిన్నతనంలోనే జాతీయ అవార్డును సాధించిన హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. ఇక 'కొత్తబంగారులోకం'తో పెద్ద హిట్ కొట్టినా, నటన పరంగా ఎంతో టాలెంట్ ఉన్నా ఆమెకి సరైన అవకాశాలను ఎవ్వరు ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత ఆమె వ్యభిచారం కేసులో పట్టుబడి, రెస్క్యూ హోంలో కౌన్సిలింగ్ తీసుకుంటున్న సమయంలో మంచు విష్ణు నుంచి దిల్‌రాజు వరకు అందరూ ఆమెకి తాము అవకాశాలు ఇస్తామని మాటలు చెప్పారు. మంచు విష్ణు అయితే తన తదుపరి చిత్రంలో ఆమె నా హీరోయిన్ అని ప్రకటించాడు. కానీ ఎవ్వరూ మాట నిలబెట్టుకోలేదు.
దాంతో ఆమెకి మాట ఇచ్చిన ఏక్తాకపూర్ మాత్రం తాను నిర్మించిన 'చంద్రనందిని' సీరియల్‌లో ఆమెకు అవకాశం ఇచ్చింది. ఇందులో మహారాణి నందిని పాత్రలో శ్వేతాబసు ప్రసాద్ ఎంతగానో ఆకట్టుకునే నటనను ప్రదర్శించి తన సత్తా చాటింది. కాగా ఈ సీరియల్ కూడా పూర్తయిపోయింది. దాంతో శ్వేతబసుప్రసాద్ మనసులను తాకే విధంగా కామెంట్ చేసింది.
నేను నటించిన 'చంద్రనందిని' సీరియల్ పూర్తయిపోయింది. రేపటి నుంచి ఇక షూటింగ్ కోసం స్టూడియోకు వెళ్లాల్సిన అవసరం లేదని తలుచుకుంటే గుండె బద్దలవుతోంది. నటనను నేను ఎంతగానో ప్రేమిస్తాను. అయినా ప్రతి ప్రయాణానికి ఎక్కడో అక్కడ ముగింపు ఉంటుంది. అలాగే 'చంద్రనందిని'కి కూడా ముగింపు వచ్చింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఏక్తాకపూర్ గారికి, సహనటీనటులు, ప్రొడక్షన్ సిబ్బంది, యూనిట్ అందరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు. ఇందులో నేను పోషించిన 'మహారాణి నందిని' పాత్ర నా జీవితాంతం గుర్తిండి పోతుందని ఉద్వేగంతో కూడిన పోస్ట్‌ని పెట్టింది.