నాడు నందమూరి తారకరత్న తన మొదటి చిత్రం కూడా చేయకముందే ఏకంగా ఒకేరోజున తొమ్మిది చిత్రాలను ప్రారంభించి, రికార్డులలో అయితే తన పేరు నమోదు చేసుకుని, అందరినోట్లో నానాడు. కానీ వాటిలో ఎన్ని విడుదలయ్యాయో ఆయన కూడా చెప్పలేడు. ఇక ప్రస్తుతం ఒకేసారి ప్రారంభించకపోయినా తన చిత్రాలు ఎప్పుడు ఐదారు చేతిలో ఉండేలా చూసుకుంటున్నాడు నారా వారి అబ్బాయి నారా రోహిత్. సరైన ప్లానింగ్, ప్రమోషన్స్ లేకుండా, రిలీజ్ డేటులు వాయిదాలు వేస్తూ, తన చిత్రాలకు తన చిత్రాలే పోటీ పడేలా... ఎప్పుడు ఏ చిత్రం రిలీజ్ అయిందో, ఏ సినిమాకి ఎవరు దర్శకుడో? అవి ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియని స్థితిలో ఆయన కెరీర్ ఉంది. ఇప్పుడు తాజాగా మహేష్ బావ, హీరో సుధీర్‌బాబు కూడా అదే రూట్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్నాడు.
తాజాగా ఆయన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏకంగా ఐదు కొత్త చిత్రాలను అనౌన్స్ చేశాడు. తన 8వ చిత్రానికి ఇంద్రసేన అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తాడని, 9వ చిత్రానికి రాజశేఖర్ దర్శకుడని తెలిపాడు. ఈ రెండు చిత్రాలను తానే నిర్మాతగా స్వయంగా నిర్మిస్తున్నానని, రాజశేఖర్ దర్శకత్వంలో చేసే చిత్రం తండ్రి సెంటిమెంట్‌తో కూడిన ప్రేమ కధ అని చెప్పాడు. ఇక తన 10వ చిత్రంగా 'జెంటిల్‌మేన్' దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్‌లతో చిత్రం చేయనున్నానని, ఈ చిత్రంలో మణిరత్నం 'చెలియా'లో నటించిన హైదరాబాదీ అయిన ఆదితీరావు హైదరీ హీరోయిన్‌గా నటిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక తన 11వ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని, అది అందరికీ తెలిసిందే అన్నాడు. దాంతో అది బాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ అని అర్ధమవుతోంది. ఇది ద్విభాషా చిత్రమని తెలిపాడు. మరి దీనికి ప్రవీణ్‌సత్తార్ దర్శకత్వం వహిస్తాడా? లేక మరెవ్వరైనానా? అనేది తెలియాల్సి వుంది. 12వ చిత్రాన్ని రచయిత హర్షవర్దన్ డైరెక్షన్‌లో పూర్తిగా యూఎస్‌లో షూటింగ్ చేయనున్నట్లు, ఇది కూడా ద్విభాషా చిత్రమేనన్నాడు.
ఇక సుధీర్‌బాబు గతంలో తెలుగు 'వర్షం'కి రీమేక్‌గా టైగర్‌ష్రాఫ్-శ్రద్దాకపూర్‌లు నటించిన 'బాగీ' చిత్రం తెలుగులో విలన్‌గా నటించిన గోపీచంద్ పాత్రని బాలీవుడ్‌లో చేశాడు. ఈ చిత్రం సరిగా ఆడకపోయినా సిక్స్‌ప్యాక్‌తో కూడిన మంచి నటనను సుధీర్‌బాబు చూపించాడు. సో.. మిగిలిన కుర్రహీరోలు దక్షిణాది చిత్రాలతో ద్విభాషా చిత్రాలు చేస్తుంటే, సుధీర్‌బాబు మాత్రం వెరైటీగా తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రాలను చేస్తుండటం విశేషం.