పూరీజగన్నాథ్ సినీ కెరీర్‌లో సంగీత దర్శకుడు చక్రిది కూడా ఎంతో మంచి పాత్ర ఉంది. పూరీతో చక్రి చేసిన సినిమాలలోని పాటలన్నీమ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గానే నిలిచాయి. కానీ చక్రి నాటి ఓ ఇంటర్వ్యూలో మీకు పూరీ మంచి ఛాన్స్‌లు ఇస్తున్నాడు కదా...! అదే పూరీకి పెద్ద పెద్ద స్టార్స్‌తో దర్శకత్వం వహించే చాన్స్ వస్తే మిమల్నే పెట్టుకుంటాడా? లేక హీరోల ఒత్తిడి మేరకు మణిశర్మ వంటి పెద్ద వారిని పెట్టుకుంటాడా? అని ప్రశ్నిస్తే పూరీ ఎంతగా ఎదిగినా తనకు ఛాన్స్‌లు ఇస్తాడనే నమ్మకం ఉందని, కానీ అదే ఆయన చేయకపోతే తనను మోసం చేసినట్లుగానే భావిస్తానని తన మాటగా చెప్పుకొచ్చాడు. కానీ నిజంగా కూడా పూరీ కొన్ని చిత్రాలకు చక్రిని పక్కనపెట్టి వేరే వారిని తీసుకున్న సంఘటనలు ఆయనకు ఎదురయ్యాయి. ఇక చక్రి మరణం తర్వాత పూరి.. చక్రి సోదరుడు, సంగీత దర్శకుడు అయిన మహిత్ నారాయణ్‌కి ఏమైనా బ్రేక్ ఇస్తాడేమో అని చాలా మంది భావించారు. కానీ పూరీ ఇప్పటివరకు మహిత్‌నారాయణ్‌కి ఛాన్స్ ఇవ్వలేదు.
మరి మీరు పూరీని చక్రి మరణం తర్వాత కలవలేదా? అని మహిత్‌నారాయణ్‌ని ప్రశ్నిస్తే... నేడు పూరీ చాలా పెద్ద డైరెక్టర్. ఆయనకు నాకు మంచి సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయి. ఇక నేను సంగీతం అందించిన పూరీ సోదరుడు సాయిరాంశంకర్ నటించిన 'నేనోరకం' పాటని పూరీనే విడుదల చేశాడు. ఆ పాటలను ఆయన హమ్ చేయడం నాకెంతో సంతోషం కలిగించింది. నేను ఇప్పటివరకు కేవలం సంగీత దర్శకునిగా సరైన సక్సెస్‌ని సాధించలేకపోయాను. ముందుగా నన్ను నేను నిరూపించుకున్న తర్వాత పూరీగారిని కలిసి ఖచ్చితంగా ఛాన్స్ అడుగుతాను అని పేర్కొన్నాడు. ఇక ఆయన 'లవ్ యు బంగారం, రామప్ప, నేనోరకం' చిత్రాలకు సంగీతం అందించడమే కాదు... అనేక మ్యూజికల్ ప్రైవేట్ ఆల్బమ్స్‌ని, మరీ ముఖ్యంగా పరిటాల రవిపై 'రవన్నా...రవన్నా' అనే పాట కూడా ఎంతో పాపులర్ అయింది. మరి మహిత్‌నారాయణ్‌కి ఎప్పుడు కమర్షియల్ సక్సెస్ వస్తుందో? ఎప్పుడు పూరీ ఆయనకు ఛాన్స్ ఇస్తాడో వేచిచూడాల్సివుంది...!