నిన్న మొన్నటివరకు పవన్ కల్యాణ్ లుక్ పై కాస్త విమర్శలుండేవి. కొంచెం ఒళ్ళు చేశాడని.. ముఖంలో కాంతి తగ్గిందని... ఒకటేమిటి చాలా విమర్శలే వచ్చాయి. ఎందుకంటే రాజకీయాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ మధ్యన ఎక్కువగా వైట్ డ్రెస్సులో మేకప్ లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా కనబడటంతో.. పవన్ లుక్ మీద ఇలాంటి విమర్శలొచ్చాయి. ఇక మేకప్ లేకుండా పవన్ ఎలా ఉంటాడనే విషయాన్ని పక్కనపెడితే.. మేకప్ తో కెమెరా ముందు పవన్ దుమ్ముదులిపేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తన ఎవర్ ఛార్మింగ్ లుక్స్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాకు ఓ లుక్ తీసుకురాబోతున్నాడు పవన్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరోప్ దేశాల్లో జరుగుతోంది. బల్గేరియాలో పవన్, అను ఇమ్మాన్యుయేల్ మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో కనబడే ఈ షాట్స్ లో పవన్ మోస్ట్ హ్యాండ్సమ్ గా కనిపిస్తాడని అంటోంది చిత్ర యూనిట్. ఇప్పటికే లీక్ అయిన కొన్ని స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని ఫొటోస్ చిత్ర బృందానికి తెలియకుండానే లీకవుతుంటే.. దర్శకుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, అను ఇమ్మాన్యువల్ సెల్ఫీ పిక్ కూడా మీడియాలో వైరల్ అయ్యింది. ఆ సెల్ఫీ లో పవన్ కళ్యణ్ కాఫీ తాగుతూ కూల్ గా... చాలా అందంగా కనబడుతుంటే..... అను ఇమ్మాన్యువల్ మొహం అయితే ఆనందంతో వెలిగిపోతూ కనబడుతుంది. మరి టాప్ డైరెక్టర్, టాప్ స్టార్ పక్కన కూర్చుని సెల్ఫీ అంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంతే ఆనందం అను ఫేస్ లో కనిపిస్తుంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న పవన్ - త్రివిక్రమ్ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ ని దాదాపు ఫిక్స్ చేసినట్లే. ఈనెల 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.