మనం తెలుగులో ట్రయాంగిల్ లవ్‌స్టోరీలను ఎన్నో చూశాం. ఒక హీరో ఇద్దరు హీరోయిన్ల ముక్కోణపు ప్రేమకథలు ఇక్కడ ఎవర్‌గ్రీన్ హిట్ ఫార్ములా. అక్కినేని, శోభన్‌బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ వంటి హీరోలు ఇలాంటి కథలతోనే ఫేమస్. ఒకే హీరోని ఇద్దరు హీరోయిన్లు ప్రేమిస్తారు. ఒకరు చివరికి హీరో కోసం, మరో హీరోయిన్ కోసం ప్రాణత్యాగం చేసి వారిద్దరిని కలిపి చనిపోతారు. మరికొన్ని చిత్రాలలో ఇద్దరు హీరోయిన్లు ఒకేహీరోతో సెటిలైపోయి శుభం కార్డు వేస్తారు. మరికొన్ని చిత్రాలలో తన స్నేహితురాలైన ఓ హీరోయిన్ కోసం, హీరో సంతోషం కోసం మరొకరు వారికి కనిపించకుండా దూరమైపోతారు. పెళ్లి సీన్లు వచ్చే సమయంలో తాళికట్టు శుభవేళ పోలీసులో, మరో హీరోయినో వచ్చి ఆపండి.. ఈ పెళ్లి జరగడానికి వీలులేదని అంటారు.
ఇక విషయానికి వస్తే కొంచెం తేడాగా ఇలాంటి సంఘటనే తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది. తిరుచ్చిలోని తురైయూర్‌కి చెందిన వెంకటేశన్ కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు అదే జిల్లాకి చెందిన ఓ యువతితో పెళ్లి ఖరారైంది. దాంతో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు అందరూ హాజరయ్యారు. అదే సమయంలో తాళికట్టే వేళలో పోలీసులు వచ్చి 'ఆపండి.. ఈ పెళ్లి జరగడానికి వీలులేదు' అని చెప్పారు. దానికి కారణం ఆ పెళ్లికూతురు ఇంకా మైనర్ కావడమే.
దాంతో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు, బంధుమిత్రలు ఉండటంతో ఎలాగైనా వివాహం జరపాలని భావించిన వరుడి బంధువులు పెళ్లి చూడడానికి వచ్చిన ఓ దూరపు సంబంధం ఉన్న యువతిని ఒప్పించి అదే ముహూర్తానికి ఆ వరుడికి పెళ్లి జరిపించారు. ఇలాంటి కథ ఏ ఎస్వీకృష్ణారెడ్డికో తెలిస్తే ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని మసాలా యాంగిల్ దట్టించి, కమర్షియల్‌గా ఓ హిట్ చిత్రం తీస్తాడు కదా!