మన సెలబ్రిటీల పుట్టినరోజు విషయాలలో ఎవరి దారి వారిదే. చిరంజీవి బర్త్‌డేలను చేసుకుంటాడు. కానీ పవన్‌కళ్యాణ్ బర్త్‌డేలు జరుపుకోడు. మరోవైపు ప్రభాస్ వంటి వారు సింపుల్‌గా చేసుకుంటారు. కానీ యుక్తవయసులో బర్త్‌డే మోజు ఉంటుంది కానీ ఒక వయసు వచ్చిన తర్వాత పుట్టినరోజు అంటే తమ జీవితం మరో ఏడాది పూర్తి అయింది. తాము మరణానికి మరో ఏడాది దగ్గరయ్యాం వంటి వేదాంతం కూడా కొందరిలో కలుగుతుంది.
ఇటీవల అమితాబ్ బచ్చన్ అదే విషయాన్ని వెల్లడించాడు. ఈ వయసులో బర్త్‌డే అంటే ఇబ్బందిగా ఉంటుందని, తన జీవితంలో మరో ఏడాది గడిచిపోవడం బాధను కలిగించే విషయమని, ఇక ఈ వయసులో ఎవరిని బర్త్‌డేలకు పిలవాలి? ఎవరిని ఎలా ఆదరించి, మర్యాదలు చేయాలనేది తలనొప్పి వ్యవహారంగా ఆయన పేర్కొన్నాడు. తాజాగా కింగ్‌ఖాన్ షారుఖ్‌ఖాన్ కూడా తన 52వ బర్త్‌డేని జరుపుకున్నాడు. ముంబైలోని అలీబాగ్‌లో ఉన్న తన ఫాంహౌస్‌లో ఆయన ఈ వేడుక జరుపుకున్నాడు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే కోరికే తనని ఇంత కాలం నడిపిస్తోందని, ఆ ఆలోచనలో లేకపోతే తనకు నిస్సత్తువ వచ్చేస్తుందని చెప్పాడు. ఈ దశలో నాకు ఆశలు, కోరికలు లేవు. బంగారం లాంటి కుటుంబం ఉంది. డబ్బు, వ్యాపారాలు, కుటుంబం, మంచి ఆరోగ్యం కూడా నాకు ఆ దేవుడు ఇచ్చాడు అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ స్టార్‌డమ్ ఈ రోజు లేదా మరో ఐదేళ్లకు ఉండకపోవచ్చు.ఆ రోజులు వస్తే గడిచిన రోజులు గుర్తుండిపోయేలా ఉండాలి. తనని తెరపై చూసే అభిమానులు, ప్రేక్షకులు సంతృప్తి చెందాలంటూ కాస్త వేదాంత ధోరణిలోనే మాట్లాడాడు.