రాజశేఖర్ నటించాల్సిన 'రమణ' రీమేక్ ని, మద్యలో చిరంజీవి ఎంటరై 'ఠాగూర్' గా తీయడంతో.. నాడు రాజశేఖర్‌కి, చిరంజీవికి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇలాగే ఒకటి రెండు చిత్రాలలో కూడా వీరి మద్య పోటాపోటీ నడవగా చివరకు వాటిని కూడా చిరంజీవినే సొంతం చేసుకున్నాడు. దాంతో రాజశేఖర్, జీవితలు నాడు బహిరంగంగానే చిరంజీవిపై విరుచుకుపడ్డారు. ఇక చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీకి తాను మద్దతు ఇవ్వనని, చిరంజీవి పార్టీకి ఓటు వేయనని రాజశేఖర్ బహిరంగంగానే ప్రకటించాడు. అలా మాట్లాడటం అతనికి ఉన్న హక్కు. తెరవెనుక రాజకీయాలు చేయకుండా రాజశేఖర్ బహిరంగంగానే చిరుపై తనకు ఉన్న వ్యతిరేకతను చెప్పాడు.
దాంతో నాడు కొందరు మితిమీరిన అభిమానం ఉన్న మెగాభిమానులు రాజశేఖర్‌పై దాడి చేశారు. ఇది చిరంజీవిపై, ఆయన అభిమానులపై తీవ్రమైన విమర్శలకు తావిచ్చింది. కానీ చిరంజీవి కూడా వెంటనే రాజశేఖర్ ఇంటికి వెళ్లి 'సారీ' చెప్పి ఆయనను పరామర్శించి వచ్చాడు. ఇక రాజశేఖర్ కూడా చిరంజీవి చిత్రంలో విలన్‌గానైనా నటించాలని ఉందని పలు సందర్భాలలో చెప్పాడు. ఇక తాజాగా మరోసారి రాజశేఖర్, జీవిత దంపతులు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు 'పీఎస్వీగరుడవేగ' ట్రైలర్‌ని చూపించారు. ఈ ట్రైలర్‌ని చూసిన చిరంజీవి మంచి యాక్షన్ చిత్రంగా ఉందని, ట్రైలర్ ఎంతో బాగుందని పొగిడి, ఈ చిత్రం విజయవంతం కావాలని కోరారు. మరోవైపు గతంలో 'ధృవ' చిత్రంలో రామ్‌చరణ్‌కి ఆపోజిట్ రోల్‌లో అరవింద్‌స్వామి పోషించిన పాత్రకు రాజశేఖర్‌ని సంప్రదిస్తే ఆయన ఓకే చెప్పాడు. కానీ తర్వాత అల్లుఅరవింద్ వచ్చి ఆ పాత్రను తెలుగులోనే చేయడానికి అరవింద్ స్వామినే ఒప్పుకున్నాడని, ఆయన నటించిన సోలో షాట్స్‌ని తెలుగులో మరలా చిత్రీకరించకుండా తమిళ్ ఒరిజినల్ సీన్స్‌నే వాడుకుంటామని రాజశేఖర్‌కు చెప్పడంతో రాజశేఖర్ కూడా మౌనం దాల్చాడు.
మొత్తానికి ఇప్పుడు మరలా మెగా ఫ్యామిలీకి, జీవిత, రాజశేఖర్‌లు దగ్గరవుతుండటంతో చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి మెగాస్టార్‌ని, రాజశేఖర్ దంపతులు కలిసినప్పుడు కేవలం సినిమాల గురించే మాట్లాడుకున్నారా? లేక రాజకీయాలు, త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న రాజశేఖర్ దంపతుల కూతుర్ల విషయం వంటిని ప్రస్తావనకు వచ్చాయా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ బంధం ద్వారా రాజశేఖర్ కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగా హీరోలతో కూడా నటించే అవకాశం ఉందనే చెప్పవచ్చు...!