మనదేశంలోని తమిళులు ఎంతో కాలం కిందట కాఫీ, టీ తోటల్లో పనిచేసుకుని పొట్ట నింపుకోవడం కోసం శ్రీలంకకు వెళ్లారు. వారిని శ్రీలంక ప్రజలు ఇండియా నుంచి వచ్చిన శరణార్ధులు అంటూ పిలిచి, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. దాంతో శ్రీలంకలోని తమిళులు ప్రత్యేక ఈలం కోసం ఎల్టీటీఈ అనే మిలిటెంట్ సంస్థను స్థాపించి, ప్రత్యేక ఈలం కోసం పోరాడారు. దానికి కెప్టెన్ ప్రభాకరన్ నాయకత్వం వహించాడు. నాడు భారతదేశం, శ్రీలంకకు మద్దతుగా, ప్రత్యేక ఈలం కోసం పోరాడుతున్న మన తమిళులను చంపడానికి మన సైన్యాన్నే పంపించడం దురదృష్టకరం.
దాంతో పాటు చర్చల కోసమని ప్రభాకరన్‌ని పిలిచి శ్రీలంక సైన్యానికి అప్పగించాలని రాజీవ్‌గాంధీ కుట్ర పన్నాడు. మేము పోరాడుతున్నాం. ఇది సింహళీయులకు, తమిళులకు జరుగుతున్న పోరాటం కనుక ఇండియా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం, శ్రీలంకలోని తమిళులకు ఆగ్రహం తెప్పించింది. మన సైన్యంతో మమ్నల్నే చంపిస్తారా? అని మండిపడిన ఎల్టీటీఈ చివరకు రాజీవ్‌ని హత్య చేసింది. ఇక చాలామంది శ్రీలంకలో ఉన్న తమిళులను మన దేశానికి బలవంతంగా పంపించారు. వారు తమిళనాడులో, ఏపీలోని తమిళనాడు తీర రాష్ట్రాలలోని ప్రదేశాలలో జీవనం గడుపుతున్నారు. వారిని మన ఇండియన్స్‌కూడా శ్రీలంక నుంచి వచ్చిన శరణార్ధులనే అంటున్నారు.
అదే విషయాన్ని మంచు మనోజ్ నటిస్తున్న 'ఒక్కడు మిగిలాడు' చిత్రంలో చూపిస్తున్నారు. శ్రీలంకలో ఉంటే అక్కడ మమ్మల్ని శరణార్దులు అంటున్నారు. మన దేశంకి వస్తే ఇక్కడా మమ్మల్ని శరణార్ధులనే అంటున్నారు.... ఇది మా దేశం కాదా సార్..? అసలు మాకు దేశమే లేదాసార్? అని మంచుమనోజ్ పోలీస్ ఆఫీసర్ అయిన పోసాని కృష్ణమురళిని ప్రశ్నించే సీన్ తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌లో బాగా ఆకట్టుకుంటోంది. ఇక మంచుమనోజ్, అనీషా అంబ్రోస్ నటిస్తున్న ఈ 'ఒక్కడు మిగిలాడు'కి అజయ్ ఆండ్రూస్ దర్శకత్వం వహించడమే కాదు.. ఓ కీలకమైన పాత్రను కూడా చేశాడు. రొటీన్ గా కాకుండా ఎప్పుడు వైవిధ్య చిత్రాలను ఎన్నుకునే మంచు మనోజ్ నటనకి, డైలాగ్ డెలివరీకి ఈ ట్రైలర్ లో చూసిన వారంతా హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు!