నేడు దేశం గర్వించదగిన క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రకాష్‌రాజ్ కూడా ఒకరు. ఆయన రూటే సపరేట్. ఆయన నటునిగానే కాదు దర్శకునిగా, నటునిగా, వ్యక్తిగా కూడా విలక్షణత కలిగిన వాడు. ఇక నేటి రోజుల్లో ఎవరైనా ఓపెన్‌గా ఏదైనా చెప్తే వారిపై విమర్శలు, దాడులు కూడా జరుగుతున్నాయి. నాడు ప్రజారాజ్యం పార్టీకి ఓటేయనని చెప్పిన రాజశేఖర్‌పై మెగాభిమానులు దాడి చేశారు. ఇక 'జనసేన' విధానాలను తప్పుపట్టిన కత్తి మహేష్‌ని లైవ్‌షోలోనే టీవీ ఛానెల్ ద్వారా చంపేస్తామని బెదిరించారు.
ఇక విషయానికి వస్తే తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ, సినిమాల పరంగా, నటన పరంగా తాను రజనీకాంత్, కమల్‌హాసన్‌ని గౌరవిస్తానే కానీ వారు రాజకీయాలలోకి వచ్చి పార్టీలు పెడితే మాత్రం వారికి ఓటు వేయనని తేల్చేశాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాట రజనీకాంత్, కమల్‌హాసన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇక ప్రకాష్‌రాజు మాట్లాడుతూ, కేవలం 'మెర్సల్'కి మద్దతు పలకడం వల్లనే హీరో విశాల్ ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయనేది నిజం కాదని చెప్పాడు. మరోవైపు ఆయన తనకంటే మోదీ పెద్ద నటుడని, ఈ విషయంలో తనేమి సందేహించడం లేదని చెప్పాడు.
నిజమే... ప్రకాష్‌రాజ్ కన్నా మోదీనే మంచి నటుడనేది ఖాయం. ఇక ప్రకాష్‌రాజ్ కేవలం నటునిగానే కాదు.. సమాజపరంగా కూడా పలు విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. తమిళనాడు రైతులు ఢిల్లీలో దీక్షలు చేసినప్పుడు ఆయన ఢిల్లీ వెళ్లి మరీ మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నాడు. ఇక బెంగుళూరులో వామపక్షవాది, ఫెమినిస్ట్, రచయిత, జర్నలిస్ట్ అయిన గౌరీ లంకేష్ హత్య సందర్భంగా కూడా ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగి ఆమె మృతిపై ఘాటుగా స్పందించిన వ్యక్తి ప్రకాష్‌రాజ్. దాంతో ఆయన రజనీ, కమల్‌ల విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.