హీరో సాయికుమార్‌కి ఇండస్ట్రీలోని అందరితో మంచి సంబంధ బాంధవ్యాలున్నాయి. ఇక ఆయన తండ్రి పిజెశర్మ, ఆయన తల్లి, సోదరులు రవిశంకర్, అయ్యప్ప శర్మలు కూడా ఇండస్ట్రీకి చెందిన వారే. ఇక అదే కుటుంబం నుంచి ఆది సాయికుమార్ వచ్చాడు. కెరీర్ ప్రారంభంలో 'ప్రేమకావాలి, లవ్లీ' చిత్రాలతో ఓకే అనిపించాడు. కానీ ఆతర్వాత ఆయన నటించిన ఏ చిత్రం కూడా యావరేజ్‌గా కూడా ఆడలేదు. సొంతంగా తీసిన 'గరమ్'తో భారీ నష్టాలు కూడా వచ్చాయి. ఇక 'శమంతకమణి' చిత్రంలో నలుగురు హీరోలలో ఒకడిగా నటించినా ఆయనకు బ్రేక్ రాలేదు. నాని, శర్వానంద్, విజయ్‌దేవరకొండ, నారా రోహిత్ ఇలా అందరూ బిజీగా ఉన్నా మంచి వర్చస్సు, అంతకు మించిన మంచి కంఠం వంటివి వారసత్వంగా వచ్చాయి. నేడు బిజీగా ఉన్న పలువురు హీరోల కన్నా ఆయనలో హీరోకి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ హిట్టేలేదు.
తాజాగా ఈయన బన్నీవాస్, జ్ఞానవేల్‌రాజా, యువిక్రియేషన్స్, వంశీ వంటి వారి సంయుక్త భాగస్వామ్యంలో నెలకొల్పిన వి4 అనే నూతన బేనర్‌లో మొదటి చిత్రంగా రూపొందుతున్న 'నెక్ట్స్ నువ్వే' చిత్రంపైనే ఆయన ఆశలన్నీ ఉన్నాయి. ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఈ చిత్రం ద్వారా ఈటీవీ ప్రభాకర్ దర్శకునిగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో ఆయన చూపించిన టాలెంట్‌చూసి మారుతి ప్రొడక్షన్స్‌లో, మరోసారి వి4 బేనర్‌లోనే సినిమా చేయనుండటం, ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆదిని చూసి ముచ్చటపడిన వి4 బేనర్‌లోని భాగస్వామి, తమిళంలో టాప్ నిర్మాత అయిన జ్ఞానవేల్‌రాజా నిర్మాతగా తాను తీయబోయే మూడు చిత్రాలలోనూ ఆదికే ఛాన్స్ ఇవ్వడంతో 'నెక్ట్స్ నువ్వే' తర్వాత ఆదిసాయికుమార్ అదృష్టం తిరగనుందని భావిస్తున్నారు.
ఈ మూడు చిత్రాలలోరెండు తెలుగు, తమిళంలో తీసే ద్విభాషా చిత్రాలు కాగా, ఒకటి కేవలం తెలుగులోనే రూపొందనుంది. ఇలా 'నెక్ట్స్ నువ్వే' విడుదలకు ముందే ఈ టీవీ ప్రభాకర్‌కి దర్శకునిగా, ఆదికి హీరోగా వచ్చినా ఛాన్స్‌లు చూస్తే వీరి దశ తిరిగిపోయిందనే భావించాలి.