ఏ సినిమా అయినా హీరో బడ్జెట్, మార్కెట్‌ని బట్టే సినిమా తీస్తారు. ఇక రాజశేఖర్‌కి ప్రస్తుతం 10కోట్ల మార్కెట్ కూడా లేదని ఆయనే ఒప్పుకున్నాడు. 'గోరింటాకు, ఎవడైతే నాకేంటి' తర్వాత ఆయనకి అసలు హిట్ అనే కాదు.. సినిమాలు కూడా లేవు. ఇక ఆయనపై ఏకంగా 25కోట్ల నుంచి 30 కోట్ల బడ్జెట్‌ని పెట్టడం అంటే అది సామాన్య విషయంకాదు. ఈ చిత్రం ఎంత పెద్దహిట్ అయినా లాభాలు రావడం కష్టమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం సినిమా కంటెంట్ బాగా ఉన్న చిత్రాలు 'ఫిదా, అర్జున్‌రెడ్డి' వంటివి చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మితమై ఏకంగా 50కోట్లను కొల్లగొట్టాయి. అలాంటి మ్యాజికే తన తాజా చిత్రం 'పీఎస్వీ గరుడ వేగ'లో జరుగుతుందని, ఇది తనకు కమ్ బ్యాక్ మూవీ అవుతుందని భావిస్తున్నాడు రాజశేఖర్.
మరోవైపు ఈ యాక్షన్ థ్రిల్లర్ బాగా ఆడితే దర్శకుడు ప్రవీణ్‌సత్తార్ కూడా పెద్ద హీరోల దృష్టిలో పడే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ని చూస్తే మాత్రం హాలీవుడ్ మూవీ చూసినంత అనుభూతి కలుగుతోంది. తాను 'డైహార్డ్' వంటి హాలీవుడ్ తరహా యాక్షన్ చిత్రాన్ని చేయాలనిఎప్పటినుంచో అనుకుంటున్నానని, అది ఈ చిత్రం ద్వారా నెరవేరుతోందని రాజశేఖర్ చెబుతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని నిర్మాతలు బడ్జెట్ ప్రకారం చెప్పిన భారీరేట్లకు బయ్యర్లు ముందుకు రాకపోతుండటంతో అయినకాడికి అమ్మేసి, నిర్మాతలే విడుదలచేసే సన్నాహాలలో ఉన్నారు. ఇక ఇది తనకు కంబ్యాక్ మూవీ కావడంతో రాజశేఖర్, సురేష్‌బాబుతో పాటు కొందరు ఇతర ప్రముఖులను కలిసి తన సినిమాకి మంచి, ఎక్కువ థియేటర్లు లభించేలా చూడాలని కోరుతుండటంతో థియేటర్ల విషయంలో రాజశేఖర్‌కి సురేష్‌బాబుతోపాటు కొందరు సహాయం చేస్తున్నారట.
ఇక ఈ చిత్రం స్పెషల్ షోకి తాను స్వయంగా చిరంజీవి దగ్గరకి వెళ్లి పిలిచానని, ఆయన ఈ చిత్రం ట్రైలర్ చూశాను...చాలా బాగుంది. మా ఆఫీస్‌లోని వారు కూడా ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారని చిరంజీవి.. రాజశేఖర్‌ని పొగిడాడట. ఆయనే ఈ విషయాన్ని మీడియాకి తెలిపాడు. ఇక ఈ చిత్రం తర్వాత పవర్‌ఫుల్ సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలు వస్తే చేస్తానని, ముఖ్యంగా 'ధృవ'లోని అరవింద్‌స్వామి చేసినటువంటి పాత్రలు చేస్తానని అంటున్నాడు. హీరోగా అవకాశాలు లేక సపోర్టింగ్, విలన్‌రోల్స్ చేస్తున్నాడనే అప్రదిష్ట రాకుండా ఈ చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టిన తర్వాతే ఆ పాత్రలలో నటిస్తానని ఎంతో నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు హీరో రాజశేఖర్.