వైసీపీలో రోజా ఎలాగో, అధికార పార్టీ టిడిపిలో మంత్రి దేవినేని ఉమ కూడా అంతే. ఆమెలాగానే ఈయన కూడా ఫైర్‌బ్రాండ్‌గా మారాలనే ప్రయత్నంలో సెటైరిక్ పంచ్‌లు విసురుతున్నాడు. అనంతపురంలోని ధర్మవరం చెరువుకు గంగ పూజ చేసిన ఆయన జగన్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ.. 'అన్నవస్తున్నాడు' అనే విధంగా జగన్ పాదయాత్రను అభివర్ణించకూడదని.. 'అన్న వస్తున్నాడు' బదులు 'దొంగ వస్తున్నాడు' అంటే బాగుంటుందని ఎద్దేవా చేశాడు. జగన్ ఎన్ని కుట్రలు, రాజకీయాలు చేసినా పోలవరం నిర్మించి తీరుతామని... సాగు నీరు-తాగు నీరుని ప్రజలకు, రైతులకు అందిస్తామని చెప్పాడు. అయితే వైసీపీ నేత జగన్ నేరాలు ఇంకా నిర్ధారణ కాలేదు. ఆయనను నిందితుడు అనాలి తప్పితే దొంగ, నేరస్థుడు, ఆర్ధిక నేరగాడు అని పిలవడం తప్పు.
ఈ విషయంలో వైసీపీ నాయకులు కోర్టుకి వెళ్లినా టిడిపి నాయకులకు, చంద్రబాబునాయుడుకు కూడా చీవాట్లు తప్పవు. నేరం రుజువు కానిదే నేరస్థుడు అని పిలవకూడదని, కేవలం నిందితుడు అనే సంబోధించాలని కోర్టులు ఎన్నోసార్లు చెప్పాయి. కానీ జగన్ పేరెత్తితే చాలు టిడిపి నేతలు దొంగ, నేరస్థుడు అనే పదాలనే వాడుతున్నారు. మరి ఓటుకు నోటు విషయంలో నిందితుడైన చంద్రబాబు కూడా నేరస్ధుడే అవుతాడా? అలా అంటే ఆయన, ఆయన పార్టీ వారు ఊరుకుంటారా? అనేది ప్రశ్నగానే మిగిలిపోతోంది.
అయినా జగన్ పాదయాత్ర చేసినా మరోయాత్ర చేసిన వచ్చే ఎన్నికలలో తమదే విజయమని భావిస్తున్న టిడిపి.. జగన్ ఏమి చేసినా ఎందుకు ఆత్మరక్షణ ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇటు టిడిపి, అటు వైసీపీ నాయకుల తీరుని, చంద్రబాబు, జగన్‌ల వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారిద్దరూ దొందు దొందే అని భావిస్తున్నారు. ఇక జగన్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని గుడ్డలూడదీసి కొట్టాలని, బహిరంగంగా ఉరితీయాలని, కాల్చివేయాలని మాట్లాడుతున్నాడు. మరోవైపు ఆయన ఏ సమస్య వచ్చినా కూడా నేను ముఖ్యమంత్రిని అవుతా.. ఈ సమస్య తీరుస్తా.. అంటూ ఉన్నాడు. ఇక అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కాకూడదనే నిర్ణయం యుద్దక్షేత్రం నుంచి యోధుడు పారిపోయిన విధంగానే భావించాల్సివస్తుంది...!