పవన్ మనసులో ఏముందో ఆయనకైనా లేక దేవుడికైనా అర్ధమవుతుందో లేదో తెలియదు గానీ ఆయన తన చిత్తం ప్రకారమే తాననుకున్నవి చేస్తాడు. నాడు చంద్రబాబుని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, అక్టోబర్ లోపల తన కమిట్‌మెంట్ చిత్రాలను పూర్తి చేసి ప్రజల మధ్యకి వస్తానని చెప్పాడు. కానీ నవంబర్ మొదలవుతున్నా పవన్ ఇంకా మేకప్ వేసుకుంటూనే ఉన్నాడు. ఇక ఇటీవల జనసేనపై దృష్టిపెట్టిన పవన్ త్రివిక్రమ్ చిత్రానికి కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇక ఈ చిత్రం షూటింగ్‌కి కూడా హడావుడిగా వచ్చి వెంటనే వెళ్లిపోతుండటంతో రోజుకి ఈ చిత్రంలోని రెండు మూడు షాట్స్‌ని కూడా చిత్రీకరించలేకపోతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా పవన్ నవంబర్ పూర్తి అయిన వెంటనే డిసెంబర్ నుంచే రాజకీయాలలో బిజీ కానున్నాడు. నీసన్-ఎ.యం.రత్నంల కాంబినేషన్‌లో చేస్తాడని ప్రచారంలో ఉన్న 'వేదాళం' రీమేక్, క్రిష్ ఆయనకి ఓ పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ స్టోరీని చెప్పాడని, ఆయనకు మైత్రి మూవీస్‌తో కమిట్‌మెంట్ ఉండటంతో క్రిష్ దర్శకత్వంలో ఆయన తనకు పొలిటికల్ మైలేజ్ ఇచ్చే చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నా కూడా వచ్చే ఎన్నికలు పూర్తయ్యే లోపు పవన్ నటించే చివరి చిత్రం త్రివిక్రమ్-హారిక హాసిని మూవీనే అని తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు పవన్. అంతేకాదు.. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్, ప్యాచ్‌వర్క్‌తో సహా అన్ని పనులను 25వ తేదీ కల్లా పూర్తిచేయమని, చిత్రాన్ని పూర్తి చేసి నవంబర్ 29న గుమ్మడికాయ కొట్టమని ఆయన త్రివిక్రమ్‌ని ఆదేశించాడట. ఆ లెక్కన నవంబర్ నెలాఖరులో మాత్రమే ఆయన చివరిగా మేకప్ వేసుకుంటాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల వరకు ఆయన మరో చిత్రం చేయకుండా పూర్తిగా జనసేన, యాత్రలు, పార్టీ సంస్థాగత పటిష్టత వంటి వాటిపై దృష్టిపెట్టనున్నాడు.
ఇక ఆయన చేసే తదుపరి చిత్రం వచ్చే ఎన్నికల తర్వాతే అని తెలుస్తోంది. కాగా త్రివిక్రమ్-పవన్ మూవీ అయిన పీఎస్‌పీకే 25 చిత్రం ఇటీవల చిక్‌మంగళూర్‌లో చిన్న షెడ్యూల్‌ని పూర్తి చేసి, కీలక సన్నివేశలు, పాటల చిత్రీకరణ కోసం 15రోజుల షెడ్యూల్‌కి యూరప్‌లో ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఇక సంక్రాంతి కానుకగా ఈచిత్రం జనవరి 10న విడుదల కానుండగా, 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు. ఇక తెలంగాణలో ప్రీమియర్లు, స్పెషల్‌షోలకు అనుమతి లేకపోవడంతో జనవరి 9 సాయంత్రం నుంచే షోలు మొదలుపెడతారని సమాచారం.