అమెరికాలో పుట్టి మిస్ ఇండియాగా యూఎస్‌లో అవార్డు తీసుకున్న నటి పూజాకుమార్. ఈమె 1997లో సినీ నటిగా ఇంగ్లీషు చిత్రాల ద్వారా పరిచయమైంది. ఇక ఈ రెండు దశాబ్దాల కెరీర్‌లో ఆమె తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో నటించింది. ఇక ఈమె కమల్‌హాసన్ 'విశ్వరూపం, ఉత్తమవిలన్' ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది. ప్రస్తుతం ఆమె సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న 'పీఎస్వీగరుడ వేగ' వంటి యాక్షన్ చిత్రంలో రాజశేఖర్‌కి భార్యగా నటించింది. ఈ చిత్రంలో తాను దేశంకోసం పోరాడుతున్న భర్తకు భార్యగా, తన భర్తకి ఏమైనా జరుగుతుందేమోనని భావిస్తూ తన భర్త నుంచి కూడా తనకు అటెన్షన్, కేరింగ్‌ని కోరుకునే పాత్రలో నటించింది.
ఇక ఈమె తన కెరీర్‌లో పలు చిత్రాలలో ఎక్కువగా తన వయసుకి తగ్గ పాత్రలు, ముఖ్యంగా భార్య పాత్రలను చేసింది. ఇప్పుడు 'పీఎస్వీగరుడవేగ'లో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. దీనిపై ఆమె స్పందిస్తూ భార్య పాత్రలు ఎన్ని చేసినా బోర్ కొట్టదు. అందునా ఆ పాత్రల్లో నటనకు స్కోప్‌తో పాటు పలు విశేషాలు ఉంటూ ఉంటాయి. ప్రతిభార్య పాత్రలోనూ ఎన్నో విభిన్నమైన షేడ్స్ ఉంటాయని చెబుతోంది. ఇంకా ఆమె మాట్లాడుతూ, ఈ చిత్రంలోని ఛేజింగ్‌లు, యాక్షన్ సీన్స్ అద్బుతంగా ఉంటాయి. తెరపై చూస్తే ఎంతో థ్రిల్లింగ్‌గా ప్రేక్షకులు ఫీలవుతారు. సాధారణంగా యాక్షన్ చిత్రాలలో క్లైమాక్స్‌లో హీరో, విలన్ మాత్రమే ఉంటారు. కానీ ఈచిత్రం క్లైమాక్స్‌లో నేను కూడా ఉంటాను.
జార్జియా, మలేషియా దేశాలలో ఎంతో కష్టపడి చేశాం. ఇక రాజశేఖర్‌గారు ఇంతకు ముందు చేసిన కొన్ని పోలీసు చిత్రాలను, వాటిల్లో ఆయన ఎనర్జీని చూసి ఆశ్యర్యపోయాను. ఈ చిత్రం షూటింగ్‌లో ఆయన ఎనర్జీని స్వయంగా చూసి ఎగ్జైట్ అయ్యాను. ప్రవీణ్‌సత్తార్ నాకు 120పేజీల బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. అలా బౌండెడ్ స్క్రిప్ట్ చదవడం ఇదే మొదటిసారి. ఆయన ఎంతో విజన్ ఉన్న దర్శకుడు అని, ఈ చిత్రం తెలుగులో మరోసారి నూతన ఒరవడికి నాందిపలుకుతుందని నమ్మకంతో చెబుతోంది పూజా కుమార్.