అక్కినేని నాగేశ్వరరావుని నటునిగా, హీరోగా అభిమానించే ఫ్యాన్స్ కూడా ఆయన డబ్బుల విషయంలో చాలా గట్టి అని, ఏ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, తనతో సినిమా తీసి నష్టపోయిన నిర్మాతల విషయంలో కూడా ఆయన పదిపైసలు ఎవ్వరికీ దానం చేసింది లేదనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఆయనలాగే ఆయన కుమారుడు నాగార్జున కూడా ఆర్ధిక విషయాలలో చాలా కఠినంగా ఉంటారని అందరూ భావిస్తుంటారు. కానీ సినిమా రంగాన్ని మద్రాస్ నుంచి హైదరాబాద్‌కి రావడంలో, గుట్టలు మిట్టలతో నిండిన నాటి హైదరాబాద్‌లో ఆయన అంత ఖర్చుపెట్టి స్టూడియోలు కట్టాడంటే కేవలం లాభాల కోసం కాదని, తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్‌కి రప్పించడానికే ఆయన అలా చేశారు.
ఇక ఆయన ప్రభుత్వపు భూముల్లో స్టూడియోలు కట్టాడని, దానిని ఆయన ఓ వ్యాపారంగా భావించాడనే విషయాన్ని మరికొందరు వినిపిస్తూ ఉంటారు. కానీ అక్కినేని ఫ్యామిలీకీ బాగా క్లోజ్ అయిన డాక్టర్, రచయిత్రి కృష్ణక్క మాత్రం ఇది నిజం కాదు అంటోంది. ఆయన ఎన్నో గుప్తదానాలు చేశాడని, కానీ తాను చేసిన సహాయం గురించి ఆయన పెద్దగా పబ్లిసిటీ ఇచ్చేవారు కాదు.. తనలోనే దాచుకునే వారని, దానికి తానే ప్రత్యక్షసాక్షినని ఆమె చెబుతోంది. ఎవరైనా సాయం అడిగితే అడిగినంత ఇచ్చే వాడని, తీసుకున్న వారు ఎప్పుడు తిరిగి ఇవ్వమంటారు? అని ప్రశ్నిస్తే నవ్వుతూ మౌనంగా ఉండేవాడట. ఇంకా ఆమె మాట్లాడుతూ, అక్కినేని గారు ప్రతిపైసాని లెక్కిస్తారని అంటుంటారు. ఆయన చాలా చిన్న స్థాయి నుంచి కష్టంతో పైకి ఎదిగారు. ప్రతి రూపాయి విషయంలో ఆయన దాని విలువ,కష్టం తెలుసుకునే వారు. అందుకే ఆయన తనకు డబ్బు సంపాదించడం అంటే ఇష్టం.. దానిని సద్వినియోగం చేయడమంటే మహా ఇష్టం అని చెప్పేవారని ఆమె చెప్పుకొచ్చింది.
ఇక ఆయన నాస్తికుడని చాలా మంది భావిస్తారు గానీ తన భార్య మరణించిన తర్వాత ఓ రోజు ఆయన కోసం వెళ్లి ఇళ్లంతా వెతికితే ఆయన కనిపించలేదని, తీరా దేవుడి గదిలో ఆయన విప్రనారాయణడుగా పూజ చేస్తూ కనిపించాడని, తాను సందేహం వ్యక్తం చేస్తే' మీ వదిన అంటే నాకెంతో ఇష్టం. ఆమెకి కూడా నేనంటే ప్రాణం. తాను మరణించిన తర్వాత దేవుని గదిలో దీపం పెట్టేవారు.. పూజ చేసేవారు లేరని తెలిస్తే ఆమె బాధపడుతుంది.. అందుకే నేను ఆ బాధ్యత తీసుకున్నానని చెప్పాడట. ఇక ఆయన చివరి రోజుల్లో రెండు నెలలు ఓ గదిలో ఉండి అభిమానులను లోపలికి కూడా రానిచ్చేవారు కాదట...తాను ఎందుకు అని ప్రశ్నిస్తే.. నా అభిమానులు నన్ను ఈ స్థితిలో చూడలేరు. చూస్తే వారి గుండెలు బద్దలైపోతాయి. నాకు నా ఫ్యాన్స్‌ని బాధపెట్టడం ఇష్టం లేదని చెప్పాడని, చివరిరోజుల్లో కూడా తన అభిమానుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ అది అని ఆమె వివరించింది.