తమిళనాట విజయ్ హీరోగా నటించిన 'మెర్సల్' చిత్రం మిక్స్డ్ టాక్ తో కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ రాజకీయనాయకుల రభస వలన ఈ సినిమాకి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఆ క్రేజ్ ప్రభావం కలెక్షన్స్ మీద పడింది. దేశం మొత్తం మీద 'మెర్సల్' చిత్రానికి ఎనలేని ఆదరణతోపాటే.. కలెక్షన్స్ కూడా వస్తున్నాయని అన్నారు. అయితే మెర్సల్ కి క్రేజ్ వచ్చిన మాట వాస్తవమే గాని... 200 కోట్లు కొల్లగొట్టిందనడం మాత్రం వాస్తవం కాదంటున్నారు.
మెర్సల్ చిత్రం 200 కోట్ల కలెక్షన్స్ సాధించిందని వస్తున్న న్యూస్ మొత్తం డమ్మీ న్యూస్ అని... తమిళ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఒకరు తేల్చేశారు. జిఎస్టితో బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజలతో ఆటలాడుకుంటుందనే విషయాన్నీ కళ్ళకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించడంతోనే.... ఈ సినిమాపై రాజకీయ రచ్చ ప్రారంభమైంది. రాజకీయ నాయకుల ఎంట్రీతోనే ఈ సినిమాకి విపరీతమైన పాపులారిటీతో పాటే కలెక్షన్స్ కూడా వచ్చాయనే ప్రచారం జోరుగా జరిగింది. రజిని రోబో తర్వాత విజయ్ మెర్సల్ చిత్రం 200 కోట్లు కొల్లగొట్టిందంటూ ఊదరగొట్టేశారు.
అయితే తాజాగా తమిళంలో ప్రముఖ పంపిణీదారుడు రామనాథం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెర్సల్ చిత్ర కలెక్షన్ల విషయంలో వస్తున్న వార్తలన్నీ కేవలం బూటకమని కొట్టి పారేశారు. అసలు ప్రేక్షకులని థియేటర్ లకు రప్పించేందుకు నిర్మాతలు ఇలాంటి టెక్నీక్ ని సృష్టించారని, మెర్సల్ 200 కోట్లు సాధించిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కుండబద్దలు కొట్టాడు. అంతేకాకుండా ఈ చిత్రానికి వచ్చిన హైప్ ని మరింతగా పెంచే క్రమంలో ఇలా ఫేక్ కలెక్షన్లని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే మెర్సల్ వివాదాలతో నలిగిపోతుంటే ఇప్పుడు ఈ రామనాథం చెప్పిన లెక్కల వివాదంతో మెర్సల్ కి ఇంకెలాంటి హైప్ వస్తుందో మరి.