నేడు నాని- విజయ్‌దేవరకొండ-నితిన్-శర్వానంద్ వంటిలాగానే అందరినీ బాగా ఆకర్షిస్తోన్న హీరో నిఖిల్. వైవిధ్యభరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా, ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణ పాత్రలు, ఎవ్వరూ చేయడానికి డేర్ చేయని పాత్రలను చేస్తూ వరుస విజయాలతో సినిమా సినిమాకి తన రేంజ్‌ని పెంచుకుంటున్నాడు. ఇక కొత్త దర్శకులను పరిచయం చేయడంలో కూడా ఈయన ముందుంటున్నాడు. సుధీర్‌వర్మ, చందు మొండేటి, విఐ ఆనంద్ వంటి దర్శకులకు బ్రేక్‌నిచ్చి మంచి టాలెంట్ ఉండే దర్శకులను పరిచయం చేస్తూ వారిని బిజీగా మారుస్తున్నాడు. ఇక ఈయన పెద్దనోట్ల రద్దు సమయంలో కూడా నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో'తో సాధించలేని విజయాన్ని తన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో సాధించి, బ్లాక్‌బస్టర్‌ని కొట్టడమే కాదు.. దర్శకుడు విఐ ఆనంద్‌కి 'టైగర్' తో సాధించలేని బ్రేక్‌ని తానిచ్చాడు. 'కేశవ' తో పెద్ద హిట్ ఇవ్వకపోయినా, నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగా ఆ చిత్రం నిర్మాతలను తనదైన ప్రేక్షకుల చలవతో ఓపెనింగ్స్ సాధించి, నిర్మాతలకు నష్టాలు రాకుండా కనీస లాభాలు వచ్చేలా చేశాడు.
ఇక ఈయన వైవిధ్యభరిత చిత్రాలు, విలక్షణ పాత్రలు చేయడంలోనే కాదు.. పాత్రకు తగ్గట్లుగా ఎలా కనిపించడానికైనా ఆయన రెడీగా ఉంటాడు. ఇక ప్రస్తుతం ఆయన కన్నడ బ్లాక్‌బస్టర్ 'కిర్రాక్‌పార్టీ' రీమేక్‌లో ఏడాది నుంచి బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయన పూర్తిగా గుబురు గడ్డంతో కనిపించనున్నాడు. తాజాగా తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేసి గడ్డంతీసేసి క్లీన్‌షేవ్‌లో దర్శనమిస్తున్నాడు. తాజాగా క్లీన్‌షేవ్‌తో ఉన్న ఫోటోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ 'ఏడాది తర్వాత గడ్డం తీసేశాను. మరలా ఏడాది తర్వాత నన్ను నేను చూసుకున్నట్లు ఉంది. నా దవడలు ఎలా ఉంటాయో కూడా ఈ ఏడాది కాలంలో మర్చిపోయాను' అంటూ ట్వీట్ చేశాడు.
ఇక ఈచిత్రం ద్వారా ఆయన సంయుక్త హెగ్డే అనే కన్నడ భామనే కాదు.. శరణ్‌కొప్పిశెట్టి అనే మరో టాలెంటెడ్ దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం కోసం ఆయన తాను దర్శకులుగా పరిచయం చేసిన సుధీర్‌వర్మ చేత స్క్రీన్‌ప్లేని, చందు మొండేటి ద్వారా సంభాషణలు రాయించి, వారిని కూడా ఈ చిత్రంలో భాగస్వాములను చేశాడు. ఈ చిత్రం టైటిల్‌ని త్వరలో అధికారికంగా రిలీజ్ చేయనున్నారు. దీనితో నిఖిల్‌కి మరో హిట్ ఖాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది.