నిన్నటివరకు బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా సాగింది. ప్రముఖ వ్యక్తులు, రాజకీయనాయకులు, క్రీడాకారులు జీవితగాధలు సెల్యూలాయిడ్‌పై ప్రేక్షకులను ఎంతో అలరిస్తూ కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇక ఇప్పుడు ఇదే ట్రెండ్ సౌత్‌కి కూడా వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటి సావిత్రి బయోపిక్‌గా 'మహానటి' తెరకెక్కుతోంది. మరోవైపు ఇప్పటికే 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి బయోపిక్ చేసిన బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌ని తేజ దర్శకత్వంలో తెరకెక్కించనున్నాడు. రాంగోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మిపార్వతి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలపై 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం తీయనున్నాడు. మరోవైపు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి లక్ష్మిపార్వతి మొదటి భర్త వీరగ్రంధం సుబ్బారావు, వారి సంసారం, విబేధాలు, ఎన్టీఆర్‌ని లక్ష్మిపార్వతి రెండో పెళ్లి చేసుకున్న పరిణామాలతో 'లక్ష్మీస్ వీరగ్రంధం' పేరుతో సినిమా తీస్తున్నాడు. ఇక చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' బయోపిక్ ఆధారంగా 200కోట్ల బడ్జెట్‌తో 'సై..రా..నరసింహారెడ్డి'ని చేయనున్నాడు.
ఇక తాజాగా టాలీవుడ్‌లో ఎన్టీఆర్ ఎలాగో తమిళనాడులో అదే తరహాలో తిరుగేలేని హీరో, ముఖ్యమంత్రిగా పనిచేసి, అన్నాడీఎంకే పార్టీని స్థాపించిన ఎమ్జీఆర్ బయోపిక్ కూడా తెరకెక్కనుంది. సీనియర్ దర్శకుడు బాలకృష్ణన్ దర్శకత్వంలో రమణ కమ్యూనికేషన్స్ ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం నవంబర్ 8న విడుదల కానుంది. ఈ ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి హాజరుకానున్నాడు. కాగా బాలకృష్ణన్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి అన్నాడీఎంకే పార్టీ నిధులు సమకూరుస్తుందని చెప్పాడు. మరి ఎమ్జీఆర్ బయోపిక్‌కి అన్నాడీఎంకే నిధులు ఇస్తే, బాలయ్యాస్ ఎన్టీఆర్ బయోపిక్‌కి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే తెలుగుదేశం పార్టీ నిధులు సమకూరుస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
కాగా ఈ చిత్రంలో 'కట్టప్ప'గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్ ఎమ్జీఆర్ పాత్రను పోషించే అవకాశం ఉంది. మరి ఈ చిత్రంలో కూడా ఎమ్జీఆర్ భార్య జానకి రామచంద్రన్, ఎమ్జీఆర్‌కి అనఫిషియల్‌గా రెండో భార్యగా గుర్తింపు పొందిన జయలలిత, శశికళ వంటి పాత్రలు ఉంటాయో లేదో వేచిచూడాల్సివుంది...!