దర్శకధీరుడు రాజమౌళి తో సినిమా అంటేనే హీరోలంతా ఎగిరిగంతేస్తారు. తన కథకి సూటయ్యే హీరోనే రాజమౌళి ఎన్నుకుంటాడు గాని.... హీరోని మనసులో పెట్టుకుని కథ సిద్ధం చేసుకోడు. ఈ విషయాన్నీ రాజమౌళినే స్వయంగా చెప్పాడు. కానీ రాజమౌళి ఈ మధ్య కాలంలో మహేష్ తో సినిమా చెయ్యాలని తరచు చెబుతున్నాడు. అలాగే మహేష్ కూడా రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చెబుతున్నాడు. కానీ మహేష్ - రాజమౌళి కలయికలో తెరకెక్కే సినిమా ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు తాజాగా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా 2020 లో ఉండబోతుంది అంటూ సోషల్ మీడియా సాక్షిగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం రాజమౌళి రెడీగా ఉన్నా కూడా మహేష్ మాత్రం చాలా బిజీగా వున్నాడు. మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమాతో బిజీగా వున్నాడు.. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. ఆతర్వాత వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఆ సినిమా పూర్తయ్యేనాటికి 2018 దాటిపోయి 2019 వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాకు కూడా మహేష్ కమిట్ అయినట్లుగా ప్రచారం జరిగింది. మరి ఆ సినిమా 2019 లోనే ఉంటుంది. అవి కాక తన మాతృ నిర్మాణ సంస్థ 14 రీల్స్ కి మహేష్ ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడు.
మరి 14 రీల్స్ - రాజమౌళి కలయికలో మహేష్ నటిస్తాడా అంటే.. అది కుదరదు. ఎందుకంటే రాజమౌళి - మహేష్ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత కెఎల్ నారాయణ రెడీగా ఉన్నాడు. మరి మహేష్ ఈ కమిట్మెంట్స్ తో 2018 , 2019 కూడా బిజీగా ఉంటే రాజమౌళి సినిమా మరి 2020 కే ఉంటుందని ఊహాగానాలు మాత్రం కరెక్ట్ అయ్యేలాగే కనబడుతున్నాయి.