ఎప్పుడో 2018 సమ్మర్ వచ్చే ఏప్రిల్ 27వ తేదీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ఇండస్ట్రీలో, సిని ప్రేక్షకులలో హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా ఇటీవలి కాలంలో అల్లుఅర్జున్ నటించిన యావరేజ్ కంటెంట్ ఉన్న చిత్రాలు కూడా టాక్‌తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధిస్తుండటంతో బన్నీతో పాటు ఆయన అభిమానులు సైతం ఉప్పొంగిపోతున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. అల్లుఅర్జున్, ఆయన తండ్రి అల్లుఅరవింద్‌లు బన్నీ చిత్రాల రిలీజ్ డేట్స్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. పోటీగాఏమీ లేని సమయంలో ఆయన సినిమాలు విడుదలవతూ ఉంటాయి. దాంతో మరో ఆప్షన్ లేకపోవడంతో ప్రేక్షకులు ఆయన చిత్రాలను చూస్తూ భారీ విజయాలు కట్టబెడుతున్నారు. కానీ వచ్చే ఏప్రిల్27 మాత్రం బన్నీకి అగ్నిపరీక్షేనని అర్ధమవుతోంది.
ఇదే తేదీన బన్నీ నటిస్తున్న 'నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా'తో పాటు మహేష్ నటించిన 'భరత్ అనే నేను' కూడా విడుదల కానుంది. ఈరెండింటిలో ఏదీ తగ్గకపోతే మాత్రం పోటీ మహారంజుగా ఉంటుంది. ఒకవైపు బన్నీవరుస విజయాలతో ఉంటే మహేష్‌కి 'బ్రహ్మూెత్సవం, స్పైడర్' చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. దాంతో మహేష్ 'భరత్ అనే నేను' చిత్రం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరోవైపు ఈ చిత్రంతో 'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న కొరటాల-మహేష్‌లు వస్తుండటంతో ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొట్టాలని మహేష్, ఆయన ఫ్యాన్స్ పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు అనే సూత్రం ప్రకారం ఈరెండు చిత్రాల విజయంలో పవన్ ఫ్యాన్స్ కూడా కీలకపాత్ర పోషించనున్నారు. 'డిజె' టీజర్‌ని మోస్ట్ డిజ్‌లైక్‌డ్‌గా మార్చి, సినిమాపై కూడా ప్రభావం చూపించడంలో పవన్ అభిమానులు కీలకపాత్ర పోషించారు. ఇలాంటి తరుణంలో బన్నీ, మహేష్‌ల చిత్రాలు ఒకే రోజున వస్తే ఇప్పటికీ 'చెప్పను బ్రదర్' అనే పాయింట్ ఆధారంగా పవన్ ఫ్యాన్స్ కావాలని ప్రిన్స్ చిత్రాన్ని చూసి బాగా ప్రమోట్ చేస్తారని చెప్పవచ్చు.
ఇక బన్నీవాసు మాట్లాడుతూ, మొదట ఆ తేదీని తాము లాక్ చేశామని, కానీ మహేష్ చిత్రం ఎందుకు అలా ప్రకటించారో తెలియదని చెబుతూనే వారు కూడా దిగి వచ్చి తమతో మాట్లాడి, చొరవ చూపిస్తే తప్ప దీనికి పరిష్కారం లేదని చెప్పాడు. ఇక 'భరత్ అనే నేను' చిత్రానికి మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా అల్లుఅరవింద్, బన్నీలకు ఎంతో సన్నిహితుడైన డివివి దానయ్య నిర్మాత కావడం విశేషం. ఇంతకు ముందు ఆయన బన్నీతో మూడు చిత్రాలు నిర్మించాడు. ఇప్పటికీ ఆయన వద్ద బన్నీ డేట్స్ ఉన్నాయి. దాంతో దానయ్య ప్రస్తుతం మరో చిత్రంగా తన వద్ద ఉన్నకాల్షీట్స్‌ని ఉపయోగించుకుని ఓ చిత్రం చేయాలని భావించాడని, కానీ బన్ని మాత్రం 'నా పేరు సూర్య', లింగుస్వామి చిత్రాల తర్వాత చూద్దాంలే అనడంతో బాధపడిన దానయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.