మంచు మనోజ్ హీరోగా నటించిన 'పోటుగాడు' చిత్రంలో 'దేవతా.. ఓ దేవతా' అనే పాటలో కనిపించి, తర్వాత 'పాఠశాల' అనే మూవీలో కూడా నటించిన బాలీవుడ్ భామ అనుప్రియ గోయెంకా. ఇక ఈ రెండు చిత్రాలలోనే కాక పలు చిత్రాలలో, వ్యాపార ప్రకటనల్లో కూడా ఈమె కనిపించింది. అయినా గుర్తింపురాలేదు. ఇంతగా కష్టపడినా రాని గుర్తింపు ఆమెకు ఇప్పుడు కేవలం సెకన్ల పాటు కనిపించిన పాత్ర ద్వారా టీజర్‌లోనే విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రాజ్‌పుత్ రాణి 'పద్మావతి' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని 'ఘూమర్' పాట విడుదలై అద్భుతమైన స్పందనని సాధించింది. ఈ చిత్రంలో దీపికాపడుకొనే డ్యాన్స్‌చేసిన ఈ పాట రాజ్‌పుత్ మహిళలు వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లేటప్పుడు చేస్తారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ రాజ్‌పుత్‌లలో ఉంది. చేతిలో పళ్లెంలో వెలిగే దీపాలను పెట్టుకుని ఈ డ్యాన్స్‌ని చేస్తారు. ఈ పాటలో దీపికా అద్భుతంగా చేసింది. ఇక ఈ చిత్రం విడుదల చేసిన ఈ పాటలో ఆమె భర్తగా నటిస్తున్న రతన్ సింగ్ పాత్రధారి షాహిద్ కపూర్ కూడా కనిపిస్తాడు.
ఇక ఈ పాటలో అలా కనిపించి వెంటనే మాయమైన నటి మరొకరు కనిపిస్తారు. ఆమె ఎవరా? అని పరిశీలించి, పరిశోధించిన వారు ఆమె 'పోటుగాడు' భామ అనుప్రియా గోయెంకా అని తేల్చారు. క్షణంలోనే ఆమె తన మొహంలో చూపిన హావభావాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 'పద్మావతి' చిత్రంలో ఆమె రతన్‌సింగ్ మొదటిభార్య అయిన నాగ్‌మతి పాత్రలో కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో ఆమెది కూడా కీలకపాత్రనే అని 'పద్మావతి' రాణి కథ తెలిసినవారు చెబుతున్నారు. ఈమె నటనాప్రతిభను పూర్తిగా చూడాలంటే డిసెంబర్1 వరకు వెయిట్ చేయాలి. మరి ఈచిత్రం అనుప్రియగోయెంకా కెరీర్‌కి ఎలా దోహదపడుతుందో వేచిచూడాల్సివుంది...!