'రుద్రమదేవి' సినిమాలో రుద్రమదేవిగా.. 'బాహుబలి'లో దేవసేనగా అద్భుతమైన నటనను కనబరిచిన అనుష్క ఇప్పుడు 'భాగమతి' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాని అశోక్ డైరెక్ట్ చేస్తుండగా.. యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. 'భాగమతి' సినిమా మొదలు పెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఈ సినిమా మాత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. 'బాహుబలి' తర్వాత అనుష్క నుండి వస్తున్న చారిత్రాత్మక సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలు అందుకోవడానికి దర్శకుడు అశోక్ కూడా అహర్నిశలు కష్టిస్తున్నాడని తెలుస్తోంది.
ఇక వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ రావడం... గ్రాఫిక్స్ లో అనుష్కని స్లిమ్ గా చూపెట్టడానికి కూడా సమయం వెచ్చించడంతో... సినిమా విడుదల అనుకున్న టైం కి జరగలేదు. అయితే ఇప్పుడు తాజాగా 'భాగమతి' సినిమా తొలి కాపీని నవంబర్ నాటికి సిద్ధం చేసి సినిమాని డిసెంబర్ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అలాగే అనుష్క ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనబడుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు ఈ విషయాన్ని సినిమా విడుదల వరకు గోప్యంగా ఉంచాలని దర్శకుడు భావించాడట. కానీ ఈ విషయం ఎలాగో బయటికి వచ్చేసింది.
అనుష్క 'భాగమతి' టైటిల్ రోల్‌తో పాటు మరో పాత్రలో కూడా కనిపించనుందట. అయితే ప్రస్తుతానికి ఆ పాత్ర గురించిన వివరాలు బయటకు రాలేదు. కాకపోతే 'అరుంధతి' సినిమాలో అనుష్క పాత్రలాగే 'భాగమతి' పాత్ర కూడా అనుష్క కెరీర్ లో నిలిచిపోతుందని అంటున్నారు. ఇకపోతే నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు కానుకగా 'భాగమతి' ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారట. మరి ఈ సినిమాలో అనుష్క రెండు పాత్రల్లో నటిస్తుందా లేదా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.