ప్రస్తుతం ఏపీలో పలు సమస్యలు, పలు వివాదాలు ఉన్నాయి. అధికారం పేరుతో టిడిపి నాయకులు చేస్తోన్న అక్రమాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. కానీ వాటిని బయటకు తీయడంలో, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షనేత జగన్ విఫలమవుతున్నారు. ఇక ఆయనకింది నేతలు కూడా అదే దారిలో నడుస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు, ఒక పార్టీ ద్వారా ఎన్నికై, ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేయకుండా అధికార పార్టీలోకి మారుతున్న జంపింగ్ జిలాంగ్‌లు ఎందరో ఉన్నారు. ఏపీనే కాదు మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో కూడా ఇదే జరుగుతోంది.
జగన్ కేవలం ఓ ఎమ్మెల్యేనే కాదు.. ఆ పార్టీకి అధినేత, త్వరలో తానే సీఎం అవుతానని భావిస్తున్న వ్యక్తి. గతంలో ఎంపీగా కూడా పనిచేశాడు. అలాంటి వ్యక్తి కేవలం ఏపీలో జరుగుతున్న పరిణామాలనే కాదు.. దేశపరిణామాలను కూడా గమనించాలి. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా చర్చను లేవదీసి కేంద్రంతో చట్టం చేయించాలి. కానీ జగన్ ఆ పని చేయడం లేదు. చట్టం చేయకుండా నీతులు చెబుతున్న మోదీ ప్రభుత్వాన్ని, టీఆర్‌ఎస్‌ని ప్రశ్నించే విషయంలో ఆయన స్వలాభాలు చూసుకుని, కేసీఆర్ మీద ఏమి స్పందించడు. బిజెపిని నిందించడు. మోదీపై తిరుగుబాటు చేసే దమ్ము చంద్రబాబుకే కాదు జగన్‌కి కూడా లేదు. ఇక అధికార పక్షంగా కేంద్రం సహకారం అవసరం కావడంతో ఈ విషయంలో కాస్త చంద్రబాబు లౌక్యం ఉందనే చెప్పాలి. మరి ప్రతిపక్ష నేత అయిన జగన్ ఎందుకు కేంద్రాన్ని చూసిభయపడుతున్నాడు?
ప్రత్యేకహోదా నుంచి రాజధాని నిర్మాణం, రెవిన్యూలోటు భర్తీ, పోలవరం నిధులు, ప్రత్యేక రైల్వే జోన్ వంటివన్నీ కేంద్రం ఆధీనంలోఉన్నాయి. కానీ జగన్ మాత్రం పాడిందే పాడరా పాచిపళ్లదాసుడా అన్నట్లు చెప్పిందేచెబుతూ అరిగిపోయిన రికార్డు వినిపిస్తున్నాడు. ఇక అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం కూడా జగన్ వేసుకుంటోన్న సెల్ఫ్‌గోల్. వచ్చే ఎన్నికల కోసం పాదయాత్రలు, ఓదార్పుయాత్రలు అంటాడే గానీ ప్రజలు ఆయన్ను, ఆయన పార్టీ వారిని గెలిపించింది అసెంబ్లీకి వెళ్లి, ప్రభుత్వాన్ని నిలదీసి సమస్యల ఉద్దృతిని జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడం తెలుసుకోలేకపోతున్నాడు. కానీ ఆయన పార్టీ వారిని అసెంబ్లీని బహిష్కరించాలని ఆదేశిస్తున్నాడు.
దీనిపై టిడిపి నాయకులు తానే పాదయాత్రలో ఉంటే తాను లేకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరైతే మిగిలిన వారు కూడా పార్టీని వీడి టిడిపిలోకి వెళ్లతారనే భయం జగన్‌లోఉందని, ఇక ఆయన ప్రభుత్వాన్ని నిలదీసే సమస్యలు ఏమీలేవని, గతంలో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేసినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభకు హాజరవ్వాలని సూచించాడని చెబుతూ జగన్‌ని మరింతగా ప్రజల్లో అన్‌పాపులర్ చేయాలని భావిస్తున్నారు. పాదయాత్ర సమయంలోనే ఆగష్టులో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను ఈనెల 10కి మార్చడం కూడా చంద్రబాబు వ్యూహమే. అసెంబ్లీ సమావేశాల సమయంలో పాదయాత్ర చేస్తే దానిని ప్రజలు హర్షించరని బాబు వేసిన ఉచ్చులో జగన్ పడ్డాడని చెప్పకతప్పదు.