ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్‌ల లాగానే మన ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతోంది. ఆ విషయాన్ని గుర్తించి సినిమాలు చేసేవారే రాణిస్తారు. ఇలా ప్రేక్షకుల పల్స్‌ని అర్ధం చేసుకోవడమే దర్శకనిర్మాతల హీరోల సక్సెస్‌కు రాచబాటను ఏర్పరుస్తాయి. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి, వైవిధ్య చిత్రాల పైనే సక్సెస్ రేటు ఆధారపడి ఉంటుందని ఇటీవల తెలుగులో వచ్చిన 'ఫిదా, అర్జున్‌రెడ్డి' వంటి చిన్న చిత్రాలు నిరూపించాయి. ఇక విషయానికి వస్తే మాస్‌మహారాజాగా పేరున్న రవితేజ ఎప్పుడు రోటీన్‌గా ఒకే తరహా చిత్రాలను చేస్తున్నాడని ప్రేక్షకులు ఫీలవ్వడంతోనే ఆయనకు వచ్చిన కొన్ని ఫ్లాప్‌లు నిరూపించాయి. దీంతో రవితేజ పని అయిపోయిందనే విమర్శలు కూడా వచ్చాయి.
రెండేళ్లు గ్యాప్ తీసుకుని ప్రపంచపర్యటన చేసిన తర్వాత రవితేజలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రొటీన్ కథే అయినా 'రాజా ది గ్రేట్'లో ఆయన అంధునిగా చేసిమెప్పించాడు. నాడు రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ప్రేక్షకుల అభిరుచి మారిందని, ఏదో ఒక కొత్తదనం లేనిదే తాను చిత్రాలు చేయనని, నానుంచి మరలా పూర్వపు ఫ్లాప్ సినిమాలు రిపీట్ కావని హామీ ఇచ్చాడు. ఇక తాజాగా ఆయన నటించే చిత్రాలు, ఒప్పుకుంటున్న చిత్రాలలో కూడా ఆయన ఎంపిక బాగా ఉంటోందని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇక రవితేజకు తాను నటించే చిత్రాల విషయంలోనే కాదు.. తాను చూసే ఇతర చిత్రాల విషయంలో కూడా ఆయన అభిరుచి మారిందని తాజా సంఘటన ప్రూవ్ చేసింది.
ఆయన తాజాగా అమీర్‌ఖాన్ స్వయంగా నిర్మించి, కీలకపాత్రలో నటించిన 'సీక్రెట్ సూపర్‌స్టార్'ని చూశాడట. ఇప్పటికే సినీ దిగ్గజాలు, రాజకీయ ఉద్దండులను కూడా మెప్పించిన ఈ చిత్రం గురించి రవితేజ ఎంతో గొప్పగా చెప్పాడు. 'సీక్రెట్ సూపర్‌స్టార్' నిజంగా అద్బుతమైన నిజాయితీతో కూడిన చిత్రం. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రధాన పాత్ర పోషించిన జైరా వసీంతో పాటు అందరు గొప్పగా నటించారు. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. కఠోరశ్రమ, అంకిత భావం టాలెంట్ ఉంటేనే ఇలాంటి చిత్రాలు వస్తాయి. వాటిని ఖచ్చితంగా ప్రపంచం కొనియాడుతుందని చెప్పుకొచ్చాడు. ఇంతవరకు కేవలం అమితాబ్‌బచ్చన్ నటించిన మాస్,యాక్షన్ చిత్రాలనే మెచ్చుకుంటూ, అదే తరహాలో చిత్రాలు చేస్తోన్న రవితేజ అభిరుచి మారిందనడానికి ఇదే ఓ ఉదాహరణ.