తీరిగ్గా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత గానీ ఏపీ రాజధాని అమరావతి ఆకృతుల డిజైన్లు మాత్రమే ఖరారయ్యాయి. దీన్నిబట్టి అమరావతిలో నిర్మాణాలు వచ్చే ఎన్నికల లోపు పూర్తయేలా లేవు. అద్భుత రాజధాని కావాలంటే మరలా తనకే ఓటు వేయాలని, పోలవరం పూర్తి కావాలంటే తననే ఎంచుకోవాలనేది చంద్రబాబు కుటిలయత్నంగా కనిపిస్తోంది. యూఎస్, యూకె. యూఏఈ లను పర్యటించి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ మినహా రాజధానిలోని భవన ఆకృతులు ఖరారయ్యాయని, సంక్రాంతి నుంచి వీటి నిర్మాణ ప్రారంభం సాగుతుందని ఖచ్చితంగా చెప్పకుండా, సంక్రాంతికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మరోసారి మాటల గారడీ చేశాడు. ఇక రాజధాని ఆకృతుల విషయంలో దర్శకుడు రాజమౌళి కీలక పాత్ర పోషించాడని, ఆయన వీటి కోసం ఎన్నో విలువైన సూచనలు ఇచ్చాడని అంటున్నాడు. ఇదేదో సినిమా ప్రెస్‌మీట్‌లాగా ఫలానా తేదీన చిత్రాన్నివిడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ఓ నటుడు కీలకపాత్ర పోషించాడు.. అని చెప్పే ధోరణిలో చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయి.
ఇక పోలవరంకి నిధుల ఇబ్బంది ఉందని, త్వరలో దానికి కూడా నిధులు వస్తాయని తెలిపాడు. ఇక వైసీపీనేతలు మాత్రం బాబు తన పాలనాకాలంలోనే అన్నింటినీ పూర్తి చేస్తానని మాట ఇచ్చాడని, నారా లోకేష్ కుమారుడు పెద్ద అయిన వాటికి రిబ్బన్‌కట్ చేసేదాకా రాజధాని విషయాన్ని బాబు సాగదీస్తూనే ఉంటాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మరోవైపు తెలుగుదేశం నాయకుల మాటల్లో చెప్పాలంటే రాజధాని, పోలవరం ఆలస్యం కావడానికి వైసీపీనే కారణమని ప్రజలు నమ్మేలా చేయాలని భావిస్తున్నారు.
వైసీపీనేతల ధోరణి వల్ల రాజధాని భూముల సేకరణలో వారు సమస్యలు సృష్టించి కోర్టుకి వెళ్లడం వల్లే అమరావతి ఆలస్యం అయిందని, ఇక పోలవరాన్ని వ్యతిరేకిస్తున్న ఒరిస్సాఎంపీలతో వైసీపీనాయకులు చేతులు కలిపి, పోలవరం నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని, కేంద్రానికి నిధుల దుర్వినియోగం అంటూ చెప్పి కేంద్రం నుంచి పోలవరానికి రావాల్సిన నిధులను వైసీపీనేతలే ఆలస్యమయ్యేలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మొత్తంగా ఎలా చూసుకున్నా, అమరావతి, పోలవరం అనేవి ప్రజల కోసం కాకుండా రాజకీయాల అస్త్రాలుగా, ఓట్లు గుప్పించిపెట్టే విషయాలుగా అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పవచ్చు.