నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు హిట్స్ తో మంచి జోష్ మీదున్నాడు. ఇప్పుడు కూడా నాని ప్రస్తుతం రెండు సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఆ రెండింటిలో ఒక సినిమా 'MCA'. దిల్ రాజు ప్రొడక్షన్ లోచేస్తున్నాడు. అలాగే మరొకటి 'కృష్ణార్జున యుద్ధం'. ఈ సినిమాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో పట్టాలెక్కించే పనిలో వున్నాడు. అయితే ఈ రెండు సినిమాలల్లో ముందుగా నాని 'MCA' సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసేసి సినిమాని డిసెంబర్ లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. కేవలం సన్నాహాలు మాత్రమే కాకుండా 'MCA' చిత్రాన్ని మొదట డిసెంబర్ 21 విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు కూడా.
కానీ ఇప్పుడు తాజాగా నాని 'MCA' డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి రాబోతుందట. అయితే నాని అనుకున్న డేట్ కన్నా ముందుకు జరగడానికి కారణం కూడా ఉందట. ఆ కారణం ఏమిటంటే.... డిసెంబర్ 21న అఖిల్ 'హలో' సినిమాని ఆ సినిమా నిర్మాత నాగార్జున విడుదల తేదీగా అనౌన్స్ చెయ్యడంతో.... నాని 'MCA' నిర్మాత దిల్ రాజు... నాగార్జున - అఖిల్ చిత్రం 'హలో' కి పోటీ ఇవ్వడం ఇష్టం లేక తమ సినిమాని ఒక వారం ముందే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాడని తెలుస్తుంది. 'ఓ మై ఫ్రెండ్' ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఈ సినిమా ఇలా ఒక వారం ముందే విడుదలకు రెడీ అవడానికి కారణం నాగార్జున అనే గుసగుసలు ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతున్నాయి. తన కొడుకు అఖిల్ సినిమాకి ఏ హీరో కూడా పోటీ పడకూడదనే ఉద్దేశ్యంతో దిల్ రాజుని కలిసి తన సినిమాని పోస్ట్ పోన్ గాని.. ప్రీ పోన్ గాని చేసుకోమని చెప్పడంతోనే దిల్ రాజు ఈ డెసిషన్ తీసుకున్నాడని ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే నాని 'MCA' డిసెంబర్ 15 విడుదల తేదీ గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.