తాతల వయసు వచ్చినా కూడా బయటికి వచ్చేటప్పుడు విగ్ లేకుండా రాని స్టార్స్ ఎందరో ఉన్నారు. చివరకు చాతిపై వచ్చిన తెల్లజుట్టుకు కూడా రంగేసుకుని, హెయిర్ ట్రాన్స్‌పరెంట్ చేయించుకుని ఇంకా యువతగా కనిపించాలని తాపత్రయపడేవారిని చూశాం. ఇక తాము విగ్గులేకుండా ఉన్నప్పుడు ఎవరైనా దానిని ఫోటో తీసి సర్క్యులేట్ చేస్తే వారిని తన్ని, చంపాలని భావించేవారిని కూడా చూశాం. ఇక ఏయన్నార్ అయితే 'సీతారామయ్యగారి మనవరాలు' చిత్రంలో విగ్గులేకుండా నటించడానికి ఒప్పుకోక చివరకు క్రాంతికుమార్ కాళ్లా వేళ్లాపడితే ఒప్పుకున్నాడు. ఇక ఏయన్నార్, శోభన్‌బాబులు తమకు వయసు పెరిగే కొద్ది తమ ముఖంలో ముసలి చాయలు కనిపిస్తుంటే బయటి లేడీస్‌కి డ్రీమ్‌బోయ్ ఇమేజ్ ఉన్న తమకు ఈ ముసలితనం ఏమిటని మరీ ముఖ్యంగా శోభన్‌బాబు రోజు అద్దం చూసుకుని డిప్రెషన్‌కి గురయ్యేవాడట.
ఇక విషయానికి వస్తే రజనీకాంత్ సినిమాలో ఎలా కనిపించినా బయట మాత్రం చింపిరి తెల్లజుట్టు, బట్టతల, చింపిరి తెల్లగడ్డంతో కనిపిస్తాడు. సినిమాలలో అందరిలా కాకుండా ఆయన ఒరిజినల్ గెటప్లో కూడా కనిపిస్తూ ఉంటాడు. ఓసారి ఓ విలేకరి రజనీకాంత్‌ని మీరు పెద్ద స్టార్ అయి ఉండి ఇలా ఎలా కనిపిస్తారు? అని ప్రశ్నిస్తే 'ఏం.. అలా కనిపిస్తే ఎవరైనా కాదన్నారా? నేను ఇలాగే ఉంటూన్నా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తునే ఉన్నారు కదా? ఇలా కనిపించినా కూడా పెద్దగా తేడా ఏమీఉండదని నన్ను చూస్తేనే తెలియడం లేదా? మనం ప్రేక్షకులను ఎలా కన్విన్స్ చేస్తే వారు అలాగే చూస్తారు...' అని సమాధానం ఇచ్చారు.
తాజాగా '2.0' ఆడియో కోసం జరిగిన ప్రెస్‌మీట్‌లో మీరు ఎలా సింపుల్‌గా ఉండగలుగుతున్నారని? ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి రజనీ నవ్వుతూ.. సినిమాలలో నటించడానికి నాకు డబ్బులు ఇస్తున్నారు. కానీ నిజజీవితంలో నటించడానికి ఎవ్వరూ డబ్బులు ఇవ్వడం లేదు. అందుకే ఇలా సింపుల్‌గా ఉన్నానని తేల్చేశాడు. దాంతో అక్కడున్న వారు నవ్వుకున్నారు. ఆయన చెప్పిన సమాధానం జోక్‌లా చాలా మందికి అనిపించవచ్చు గానీ ఆయన జీవిత సత్యాన్ని. ప్రకృతి మార్పులను, నిజజీవితంలో నటించే వారిని, ఇలా అందరికీ ఓకే ఒక వాక్యంలో సమాధానం చెప్పాడు...!