ఒక్కోసారి పెద్ద చిత్రాల మద్యలో వచ్చిన చిన్నహీరోల చిత్రాలు అనూహ్యంగా విజయం సాధిస్తుంటాయి. 'ఆనంద్, హ్యాపీడేస్, శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్‌రాజా, రన్‌రాజారన్, బిచ్చగాడు, మహానుబావుడు' వంటి చిత్రాలెన్నోఈ కోవలోకే వస్తాయి. ఇక దీపావళికి ఇలయదళపతి నటించిన 'మెర్సల్' చిత్రం విడుదలై, వివాదాల ద్వారా మంచి ప్రమోషన్, పబ్లిసిటీని సాధించింది. ఈ చిత్రంతోపాటు 'పిజ్జా' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా, కొత్త దర్శకుడు రత్నకుమార్ దర్శకత్వంలో వైభవ్ హీరోగా వచ్చిన 'మెయ్యాద మాన్' చిన్న చిత్రంగా సైలెంట్‌గా వచ్చింది. ఈ చిత్రాన్ని 'మెర్సల్' మాయలో పడి మూడురోజుల వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ తర్వాత మౌత్‌టాక్ బాగా పాజిటివ్‌గా రావడంతో ఈ చిత్రం కలెక్షన్లతో పాటు వీకెండ్‌లో థియేటర్లు కూడా పెరిగాయి. ఇంకా థియేటర్లను పెంచడానికి నిర్మాతలు సన్నద్దం అవుతున్నారు.
పెట్టిన బడ్జెట్- వచ్చిన లాభాల కింద లెక్కిస్తే 'మెర్సల్' కంటే ఈ చిత్రమే పెద్ద హిట్ అని తేల్చేస్తున్నారు ట్రేడ్‌పండితులు. వన్‌సైడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన దీనిని త్వరలో డబ్బింగ్ చేయనున్నారు. ఇక వైభవ్ సుప్రసిద్ద దర్శకుడైన కోదండరామిరెడ్డి తనయుడు అన్న విషయం తెలిసిందే. వైభవ్ మొదటి చిత్రానికి కోదండరామిరెడ్డినే దర్శకుడు. ఈ చిత్రం పేరు 'గొడవ'. ఆ తర్వాత ఆయన 'కాస్కో', 'యాక్షన్ త్రీడీ' వంటి చిత్రాలలో కూడా హీరోగా నటించాడు. కానీ ఆయన నటుడిగా పనికిరాడని మనవారు నిర్ణయించారు. దాంతో ఆయనకోలీవుడ్ వెళ్లి, దర్శకుడు వెంకట్‌ప్రభు, ఎస్పీబాలు తనయుడు వంటి వారి అండతో తమిళంలో 'సరోజ, గోవా, ఈసన్' నుంచి చాలా తమిళ చిత్రాలలో నటించాడు.