దేవుడు ఉన్నాడు..లేడు...మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు.. అనే విషయం ప్రకృతి రహస్యం. కానీ కొంత మంది దొంగబాబాలు, జ్యోతిష్కులు మీరు పూర్వ జన్మలో ఇది చేశారు.. అది చేశారు... మీ ఆత్మ ఇలా వెళ్తుంది... మరలా గొప్పవాడిగా పుడతారు.. అని చెబుతూ ఉంటారు. ఎవరైనా ఇదినిజం కాదని, దేవుడిని చూపించమని అడిగితే వారి వద్ద అద్భుతమైన సమాధానం ఉంటుంది. గాలిని మీరు చూడగలరా? దెబ్బ తగిలినప్పుడు ఆ నొప్పిని చూపించగలరా? ఇదీ ఇంతే అంటారు. దానికి మన దగ్గరే కాదు...ఎవ్వరి వద్ద ఆన్సరే ఉండదు. ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ కూడా అదే రూటులో నడుస్తూ మరణించిన ఎన్టీఆర్ ఆత్మకు తెరపైకి తెచ్చాడు. సాధారణంగా వర్మ ఒకసారి చెప్పిన మాట, నిలకడ మరోసారి ఉండవు. మరోసారి చెప్పడు. ముందు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడేదానికి సంబంధం ఉండదు. మనం అదేంటి అలా అప్పుడన్నారు? ఇప్పుడేమో ఇలా అంటున్నారేంటి? అని ప్రశ్నిస్తే, నా మాటల మీద నాకే నమ్మకం ఉండదు. మరి మీరెలా నా మాటలను నమ్ముతారు? అని లాజిక్‌గా ప్రశ్నిస్తున్నాడు.
ఇప్పుడు ఆయన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం కోసం వివాదాస్పద సన్నివేశాలు, డైలాగులు, పాటలు రాయించే బిజీలో ఉన్నాడు. అవి వివాదాస్పదం అయినా, ఎవరైనా నువ్విష్టం వచ్చినట్లు నీవు తీస్తే ఎలా? అని ప్రశ్నిస్తే సమాధానంగా ఆయన ఎన్టీఆర్ ఆత్మ తనకు చెప్పిందని కామ్‌గా ఉండిపోయే వెసులుబాటును తనకు తాను సృష్టించుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్ వర్మతో సారీ... ఎన్టీఆర్ ఆత్మ ఆకాశవాణి... (ఆకాశవాణి అంటే వర్మ దృష్టిలో రేడియో కాదు) గా, అశరీర వాణిగా తనకు మాత్రమే వినిపించిన సందేశాన్ని వీడియో తీసి, ఎన్టీఆర్ తరహాలోనే డబ్బింగ్ చెప్పించి వదిలాడు. ఇందులో ఎన్టీఆర్ ఆత్మ రాంగోపాల్‌వర్మ సాహసాన్ని,ప్రతిభను, మేధస్సును, వ్యక్తిత్వాన్ని పొగుడుతూ, తనకు నన్ను ఏయన్నార్ పరిచయం చేశాడని ఆత్మద్వారా వినిపించాడు. తన అర్ధాంగి లక్ష్మీపార్వతికే కాదు.. లోకానికి, ఎవ్వరికీ తెలియని రహస్యాలను మీకు మాత్రమే నా ఆత్మద్వారా తెలుపుతానని, మరుగున పడిపోతున్న చారిత్రక సత్యాలను మరుగున పెడుతున్న వారు బతికుండగానే తెరకెక్కించే సాహసం చేస్తున్నారని పొగిడి, నా ఆత్మ ద్వారా ఆ వివరాలను, రహస్యాలను మీకు మాత్రమే అశరీర వాణిగా తెలియజేస్తానని, ఏ సమాచారం మీకు ఎప్పుడు అవసరమో తాను అప్పుడే వచ్చి జరిగిన విషయాలను, సంఘటనలను చెబుతానని, ఇకపై నా ఆత్మ, నా మాటలు మీకు తప్ప ఎవ్వరికీ కనిపించవు.. వినిపించవు అని చెబుతూనే తాను స్వర్గంలో కూడా స్వర్గాధినేతతో సమానమైన గౌరవం పొందుతున్నానని, ఇది నమ్మని వారందరూ నరకానికి పోతారని వర్మకు చెప్పినట్లుగా ఆ వీడియో ఉండటం విశేషం. ఇక తాజాగా ఎన్టీఆర్ చరమ దశలోని విషయాలను చూపుతానని చెబుతూనే, వర్మ తనకు అసలు వైస్రాయ్ హోటల్ సంఘటనల గురించే తెలియది వ్యాఖ్యానించడం విశేషం.