తెలుగులో ప్రముఖ సపోర్టింగ్ యాక్టర్, కమెడియన్‌గా ఎల్బీ శ్రీరామ్ కి మంచి పేరుంది. ఈయన స్వతహాగా మంచి రచయిత. కొన్ని చిత్రాలకు కూడా రైటర్‌గా పనిచేసి ఉన్నాడు. తాజాగా ఆయన మన సినీ హీరోలు, దర్శకుల గురించి ఓ ఇంటర్వ్యూలో రాపిడ్‌ఫైర్ రౌండ్‌లో అడిగిన ప్రశ్నలకు అడిగినట్లుగా టకాటకా సమాధానాలు చెప్పి, తనలోని ఆ రచయితను బయటికి తీశాడు. ఇక ఆయన పవన్‌ని 'జంఝామారుతం' అని చెబుతూనే చిరంజీవి అంటే 'ఇంద్ర, మెగా సింహాసనం', ఈవీవీ అంటే 'ఎవరెస్ట్', కె.విశ్వనాథ్ అంటే 'కళాతపస్వి, దాదాసాహెబ్ యశస్వి, అన్నింటినీ మించి ఆయన ఎప్పటికీ శంకరాభరణం', క్రిష్ అంటే 'మట్టికి మనిషికి ఉన్న సంబంధం', రాజమౌళి అంటే 'తిప్పరా మీసం', పరుచూరి బ్రదర్స్ అంటే 'సంచలనం'అని చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, బ్రహ్మానందం అంటే 'హాస్య విశ్వరూపం' అని అభివర్ణించాడు. దీనిలో హైలైట్ ఏమిటంటే ఆయన తన గురించి తాను విశ్లేషించుకుని, అభివర్ణించుకున్న తీరనే చెప్పాలి. ఎల్బీ శ్రీరామ్ అంటే.. వాడెవడు.. వాడొక చీమ.. ఏ పంచదార పలుకునే,తనకంటే బరువున్న బియ్యపు గింజనే మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వాటిని మోసుకెళ్లేది నలుగురికి పంచడానికోే. లేక తానే మెక్కేయడానికో.. అంటూ విసిరిన పంచ్‌లను, అందరినీ ఆయన అభివర్ణించిన తీరు అద్భుతమని చెప్పకతప్పదు. బహుశా ఆయనకేమైనా మరలా రచయిత వైపు గాలి మళ్లిందేమోనని సందేహం. ఎందుకంటే ప్రస్తుతం కొత్త నటీనటులు, కమెడియన్ల రాకతో బ్రహ్మానందంతో పాటు ఎల్బీశ్రీరాం వంటి వారికి అవకాశాలు బాగా తగ్గాయనే చెప్పవచ్చు.