కేవలం నిరక్ష్యరాస్యులే మూఢనమ్మకాల పేరుతో స్వామీజీలను నమ్ముతారని అంటారు. కానీ స్వామిజీల భక్తులను చూస్తే మాత్రం ఎక్కువగా పేరు, పలుకుబడి ఉన్నవారు. మాజీ ఐఏయస్, ఐపిఎస్‌ల వంటి వారు ఉంటారు. ఇక రాజకీయ నాయకులు, సినీతారలతో వీరికి అవినాభావ సంబంధం ఉంటుంది. పెద్ద పెద్ద హోదా ఉన్న రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రుల నుంచి జడ్జిలు, చివరకు రాష్ట్రపతి, ప్రధాన మంత్రుల వంటి వారే స్వామీజీలకు తలలు వంచి పాదాభివందనాలు చేస్తుండటంతో వీరిలో ఏదో మహత్మ్యం ఉందనే సామాన్యులు ఫీలవుతారు. పుట్టపర్తి సాయిబాబా నుంచి నాటి చంద్రస్వామి వరకు దేశరాజకీయాలనే శాసించారు. ఇక డేరా బాబా సంగతి అందరికీ తెలిసిందే. మరో విశేషం ఏమిటంటే.. ఇలాంటివి నిరక్ష్యరాస్యులు ఎక్కువగా ఉండే ఇండియాలోనే కాదు.. ఎంతో అభివృద్ది చెందిన అమెరికా వంటి దేశాలలో ఉంది. చాలా ఏళ్ల కిందట ఆ క్రిస్టియన్ మత పెద్ద ఫలానా సమయంలో చనిపోతే దేవుడి కుమారుడికి వచ్చినంత మహత్మ్యం వస్తుందని చెప్పడంతో అమెరికాలో దాదాపు 50 మంది భక్తులు తమకు తాముగా సజీవ దహనం చేసుకున్నారు.
ఇక డేరా బాబా ఆశ్రమంలో ఎన్ని శవాలు ఉన్నాయి? ఎంత డబ్బుంది? పుట్టపర్తి సాయిబాబా మరణించిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. ఇక స్వామి పరమహంస నిత్యానంద సినీ నటి రంజితతో జరిపిన కామ క్రీడలు అందరికీ తెలిసినవే. ఆయినా దోషులు ఎక్కువగా తప్పించుకుంటున్నారు. ఎక్కడో కనిపించని దేవుడు తమ మొర ఆలకించి, తమ కోరికలు తీరుస్తాడో లేదో తెలియదు కాబట్టి ఇలా ఇన్‌స్టంట్ బాబాల వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. మరోవైపు ఎందరో స్వామిజీలు మహిళలతో ఎన్నో పాడు పనులు చేసి, చివరకు కేసు దాకా వస్తే అసలు తమకు లైంగిక పటుత్వమే లేదనే వాదన చేస్తుంటారు. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన 'జులాయి' చిత్రంలో మన దేశంలో లాజిక్కులను కంటే మ్యాజిక్కులనే ప్రజలు ఎక్కువగా నమ్ముతారని, అందుకే శాస్త్రవేత్తలకు కూడా లేని క్రేజ్ స్వామిజీలకు ఉందని డైలాగ్ రాశాడు. తాజాగా కర్ణాటకలోని యహలంకలోని హుణసేమా రెనహళ్లి పీఠాధిపతి పర్వతరాజు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇద్దరినీ ఆశ్రమంలోనే ఉంచుకున్నాడు. అతని రెండో భార్య కుమారుడైన దయానంద అలియాస్ నంజేశ్వర శివాచార్య పదో తరగతి డీబారై జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన దయానందను 2011లో తన స్థానంలో పీఠాధిపతిని చేసేందుకు పర్వతరాజు ప్రయత్నించాడు. ట్రస్ట్ సభ్యులు నిరాకరించడంతో ఇది సాధ్యపడలేదు. ప్రస్తుతం తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోయే సరికి500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మఠంలోని వ్యవహారాలన్నీ దయానంద్ తన కనుసన్నలలో పెట్టుకున్నాడు.
కొందరు ట్రస్ట్ సభ్యులు, ఉద్యోగులను తన వైపు తిప్పుకుని మఠంలోనే ఓ మూడు చిత్రాలలో నటించిన కన్నడ నటితో మఠంలోనే శృంగారం జరిపేవాడు. ఆ నటి నటించే నాలుగో చిత్రానికి కూడా ఆయనే నిధులు సమకూర్చాడు.మఠంలోని వీరి రాసలీలలను ఆయన వ్యతిరేకులు వీడియోలు తీసి టివీఛానల్స్‌కి ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఎంతో పవిత్రమైన ఈ మఠాన్ని పర్వతరాజు పీఠాధిపతి అయిన తర్వాత కుటుంబ మఠంగా మార్చేశాడు. కానీ పోలీసులు మాత్రం ఆ వీడియోలనే ఆధారంగా తీసుకోకుండా చిన్నచిన్న వారిని వేధించే ఈ పోలీసులు ఇంకా తమకు ఫిర్యాదు అందలేదని డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. దీనిపై భక్తులు పోలీసులపై మండిపడుతున్నారు.