సినిమా అనేది ఎంతో శక్తివంతమైన మాధ్యమం. టీవీలు చూసేవారు ఉన్నారో లేదో తెలియదు గానీ టీవీచానెల్స్ రాని రోజుల్లో కూడా నిరక్షరాస్యులకు కూడా సినిమాలు మంచి సందేశాన్ని అందించేవి. కానీ రాను రాను సినిమా వ్యాపారంగా మారి, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి జూదంగా మారింది. నాటి నాటకాలు, బుర్రకథలు, హరికథలు.. ఇలా అన్ని కళారూపాలలోనూ నీతిని చూపించే ప్రయత్నం చేసేవారు. అయితే సినిమా ద్వారా ప్రజలకు సందేశం అందించవచ్చా? అని ప్రశ్నించేవారికి రెండు రకాల భిన్నవాదనలు వినిపిస్తూ ఉన్నాయి. నాడే ఓ గొప్ప దర్శకుడు ప్రజలకు సందేశం ఇవ్వాలంటే లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టి మేమే సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. ఒక పోస్ట్ కార్డ్‌లో ఆ సందేశం రాసి పంపిస్తే సరిపోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇక మీడియా నాశనమైపోతోందని గగ్గోలు పెడుతూ, మీడియా ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని నీతులు చెప్పేవారు.. మీడియా కన్న బలమైన సినీ మాధ్యమాన్ని ఎందుకు మంచికి ఉపయోగించుకోలేకపోతున్నారు? అనే ప్రశ్న ఉదయించకమానదు. ఇక కళ కళ కోసమో డబ్బుల కోసమో కాదు.... ప్రజల కోసమని నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారు. తమిళ దర్శకులు శంకర్, మురుగదాస్, కె.బాలచందర్, హిందీలో అమీర్‌ఖాన్, తెలుగులో మాదాల రంగారావు, టి.కృష్ణ, ఆర్.నారాయణమూర్తి, నరసింగరావు, కె.విశ్వనాథ్ వంటి వారు సినిమాలలో ఏదైనా నీతి చెబుతూనే కమర్షియల్ చిత్రాలు తీశారు, తీస్తున్నారు. కొత్త దర్శకుల్లో కొరటాల శివ కూడా అదే పని చేస్తున్నాడు.
దీనిపై ఇటీవల పెద్దాయన కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ.. కోట్లు పెట్టి 'బాహుబలి'లు పై పంచ్ వేశారు. అదే సమయంలో ఆ బడ్జెట్‌తో నీతిని బోధించే 'బిచ్చగాడు' వంటి చిత్రాలను 20కి పైగా తీయవచ్చని చెప్పాడు. ఇక విషయానికి వస్తే దర్శకుడు శంకర్ తానెంత భారీ బడ్జెట్, స్టార్స్‌లో సినిమా తీస్తున్నా కూడా మెసేజ్‌ని మిళితం చేసి దానికి కమర్షియాలిటీ ఇస్తాడు. అతని శిష్యుడు అట్లీ కూడా అదే దోవలో నడుస్తున్నాడు. 'రాజు రాణి, తేరి' ఒకవంతైతే తాజాగా వచ్చిన 'మెర్శిల్' చిత్రం మరోఎత్తు.
ఆయన 'మెర్శిల్' చిత్రం గురించి మాట్లాడుతూ.. నా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ చిత్రం తీశాను. ప్రస్తుతం వైద్యం పేదలకు అందుబాటులో లేకుండా పోయింది. దానినే కమర్షియల్ కోణంలోచెప్పాను. ఈ అంశం వివాదాస్పదమైంది. దేశంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఓ పౌరుడిగా, భారతీయునిగా, దర్శకునిగా అలా చెప్పి, ప్రజలలో ఆలోచన రేకెత్తించడం నా బాధ్యత అని తేల్చిచెప్పాడు. ఏదో ప్రేమ విఫలమైందని, గుండెల నిండా దమ్ముకొడుతూ, మితిమీరిన బూతు డైలాగులు, అసభ్యసన్నివేశాలు, డ్రగ్స్ తీసుకోవడం వంటి వాటిని చూపి ఇది బోల్డ్ మూవీ, కంటెంట్ ఉన్న చిత్రం, అదిరిపోయే కాన్సెప్ట్, ఇదో ట్రెండ్ సెట్టర్ అని యువత వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకునే వారు అట్లీని చూసైనా మారాల్సి వుంది...!