నాడు అనే కాదు.. నేడు కూడా అభిమానులు సినిమాని సినిమాగా చూడకుండా, తమ సొంత శత్రుత్వాలను చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు కాస్త తగ్గింది గానీ పాతకాలంలో ఫలానా హీరో చిత్రంలో ఫలానా నటుడు నటించడానికి వీలులేదు. ఫలానా విలన్‌ని మా హీరోనే కొట్టాలి..చంపాలి.. అనే గొడవలు వచ్చేవి. ఇక మల్టీస్టారర్ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పడానికి లేదు. పక్క హీరో విలన్‌ని ఎన్ని దెబ్బలు కొట్టాడో మా హీరో కూడా అన్నే దెబ్బలు విలన్‌ని కొట్టాలి. ఫలానా హీరోకి ఎన్ని ఫైట్స్, ఎన్ని సాంగ్స్ ఉంటే మా హీరోకి అన్నే ఉండాలి అని కండీషన్స్ పెట్టేవారు. ఇక నాడు ఓ హవా సాగించిన పరుచూరి బ్రదర్స్ కూడా చిరంజీవి సినిమాకి పనిచేస్తూ ఉంటే.. ఆ వేడుకకు వెళ్లి స్టార్స్ ఎందరు ఉన్నా మెగాస్టారే గ్రేట్ అంటూ అభిమానులు రెచ్చిపోయే విధంగా ప్రసంగాలు చేసేవారు. అదే బాలకృష్ణ సినిమాకి పనిచేస్తూ ఉంటే ఆ వేడుకకి వెళ్లి నందమూరి హీరోల ముందు ఎవ్వరూ నిలబడలేరు. బాలయ్య మాత్రమే గ్రేట్ అనే విధంగా భజన చేస్తూ ప్రసంగాలు చేసి, వాటి ద్వారా అభిమానులు కొట్టుకునేలా చేసేవారు.
ఉదాహరణకు నాగార్జున పెద్దగా ఇటువంటి విషయాలు పట్టించుకోడు. సీన్ డిమాండ్‌చేస్తే ఏదైనా చేస్తాడు. కానీ నాడు వచ్చిన 'వారసుడు' చిత్రంలో తన తండ్రిగా నటించిన కృష్ణ కాలర్ పట్టుకుంటాడు. దానికి కృష్ణ అభిమానులు మండిపడి, ఆ సీన్స్ తీసేయాలని ఆందోళనలు చేసి పలు థియేటర్లలో రీల్‌బాక్స్‌లను బలవంతంగా ఎత్తుకెళ్లి కాల్చేశారు. ఇక విషయానికి వస్తే తాజాగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ తనకు ఎదురైన ఓ అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. చాలా ఏళ్ల కిందట ఏయన్నార్, వెంకటేష్‌లు హీరోగా 'బ్రహ్మరుద్రులు' చిత్రం వచ్చింది. ఆ చిత్రంలో పరుచూరి గోపాలకృష్ణ విలన్‌గా నటించాడు. ఈ చిత్రం షూటింగ్‌లో పరుచూరిని ఏయన్నార్ కాల్చి చంపుతాడు.
దాంతో షూటింగ్ చూడటానికి వచ్చిన వారిలో కొందరు 'పైసలు లేకుండా చస్తున్నావా అన్నా?' అన్నారు. నాకు అర్ధం కాలేదు. 'పైసలేంటి, చావడం ఏమిటి?' అని అడిగాను. 'మీరు ఎన్టీఆర్ గారికి వీరాభిమాని కదా..! మరి ఎన్టీఆర్ వీరాభిమాని అయిన మీరు ఏయన్నార్ చేతుల్లో చస్తున్నారు ఏమిటి?' అంటే ఎన్టీఆర్ వీరాభిమానిగా ముద్ర పడిన నా పాత్ర ఏయన్నార్ చేతుల్లో చనిపోకూడదని వారి ఉద్దేశ్యం. అభిమానుల హృదయాలు ఎలా ఉంటాయనే దానికి ఇది ఓ ఉదాహరణ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.