చిరంజీవి 151 వ చిత్రం 'సై రా నరసింహ రెడ్డి' ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతోన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 'సై రా నరసింహరెడ్డి' సినిమా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు కాబట్టి... ఈ చిత్రంలో తెలుగు, హిందీ, తమిళ సినీ పరిశ్రమకు చెందిన టాప్ స్టార్స్ కి చోటిచ్చిన విషయం తెలిసిందే. 'సై రా' షూటింగ్ అధికారికంగా మొదలు పెట్టకపోయినప్పటికీ ఈ సినిమాకి సంబందించిన అనేక రకాల వార్తలు నిత్యం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుండి టాప్ టెక్నీషియన్స్ ఏ ఆర్ రెహ్మాన్, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ తప్పుకున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ సంగతి ఎలా వున్నా.. రవి వర్మన్ మాత్రం ఈ సినిమానుండి తప్పుకోగానే 'సై రా' కోసం 'రంగస్థలం' సినిమాటోగ్రాఫర్ రత్నవేలుని దింపాడు రామ్ చరణ్. ఇదంతా ఇలా ఉండగా... ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్రంలో అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతిలతోపాటే.... విజయశాంతి కూడా ఒక కీలకపాత్రలో నటించబోతోందని జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఇదే వార్త గతంలో అంటే... 'సై రా' సినిమా మొదలు పుట్టకముందు నుండే ప్రచారంలో ఉంది. ఖైదీ నెంబర్ 150 సినిమా టైం లో కూడా విజయశాంతి పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఈచిత్రంలోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం 'సై రా' చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి, విజయశాంతిని కలిశాడని...... ఇలా విజయశాంతిని కలవడానికి స్వయంగా చిరంజీవే ఫోన్ చేసి మరీ అపాయింట్మెంట్ ఇప్పించాడనే ప్రచారం మొదలైంది. అయితే విజయశాంతి 'సై రా' నటించడంలో పక్కా అని...అలాగే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటున్నారు కూడా.