సినిమా థియేటర్లలో ప్రతి షోకి ముందు ప్రేక్షకులు లేచి నిలబడి జాతీయ గీతం ఆలపించాలనే నిబంధన పట్ల పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సినిమా థియేటర్ల దాకా వచ్చి టిక్కెట్లు కొని, సినిమాని రెండున్నర మూడు గంటలు చూసేందుకు ఓపిక ఉన్న ప్రేక్షకులు కొద్దిసేపు దేశం కోసం జాతీయగీతాన్ని ఆలపించలేరా? సినిమా టిక్కెట్ల కోసం, దేవుడి దర్శనం కోసం గంటలు వేచిచూసే ప్రజలు సినిమా థియేటర్లలో జాతీయగీతం సందర్భంగా నిల్చుని దేశభక్తిని చాటుకోవడంలో ఇబ్బందేమిటి? అనేది కొందరి ప్రశ్న. మరి థియేటర్లలోనైనా షాపింగ్ మాల్స్‌లోకి ప్రవేశం ముందు, ప్రభుత్వకార్యాలయాలు, పార్టీ ఆఫీస్‌లు, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజుల్లో వాటి ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఎందుకు ఆలపించడం లేదని మరికొందరు విమర్శిస్తున్నారు.
ఇక బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల వాదన మునుపు ఎలా ఉండేదంటే వారు బహిరంగంగానే 'జనగణమన' మన జాతీయ గీతం కాదని, దానికి ముందు నుంచి ఉన్న 'వందేమాతరం' గీతమే జాతీయ గీతంగా పెట్టాలని వాదించేవారు. దేశ జాతీయ పతాకం విషయంలో కూడా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు మన దేశానికి త్రివర్ణ పతాకం ఎలా జాతీయ జెండా అవుతుంది? మొదటి నుంచి మన దేశంలో కాషాయ జెండాకు ఎంతో గౌరవం ఇచ్చేవారు కాబట్టి కాషాయ జెండానే మన జాతీయ జెండా అని కూడా వాదించేవారు. అలాంటి వారిలో ఇప్పుడు అనుకోకుండా 'జనగణమన' పై ప్రేమ పుట్టుకొచ్చింది.
ఇక విషయానికి వస్తే థియేటర్లలో షో ముందు జాతీయ గీతం ఆలపించాలనే నిబంధనపై కమల్ మాట్లాడుతూ, దేశభక్తిని ప్రజలపై బలవంతంగా రుద్దకూడదు. ఏ విషయం అయినా సరే ప్రజలను బలవంతం చేసేలా ఉండరాదు. సింగపూర్‌లో నిర్ణీత సమయాలలో టివీలలో జాతీయ గీతాన్ని ప్రసారం చేస్తారు. అలాగే మన టీవీ ఛానెల్స్‌లో కూడా జాతీయ గీతాన్ని ప్రసారం చేయాలి. సింగపూర్‌లో అర్ధరాత్రి పూట కూడా జాతీయ గీతం ప్రసారం అవుతుంది. కాబట్టి అన్ని టీవీ ఛానెల్స్‌లో ఉదయం, రాత్రి జాతీయ గీతాన్ని ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. మొత్తానికి ఈ నిర్బంధ దేశభక్తిని చాటడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. దేశభక్తి నరాలలో, లోపల ఉండాలి కానీ అది బయటకు చూపించి హంగామా చేస్తే రాదనేది మాత్రం వాస్తవం.