తెలుగు సినీ పెద్దలు ముందుగా తామే కొత్త తరహా చిత్రాలను తీసి ట్రెండ్‌ని క్రియేట్ చేయలేరు. 'మెర్శల్' వంటి ప్రజలను ఆలోచింపజేసే చిత్రాలు చేయాలంటే వారికి గట్స్ చాలవు. కానీ ఎవరైనా ఏదైనా సంచలనం సృష్టిస్తున్నారని తెలిస్తే మాత్రం గొర్రెల మందలా తాము కూడా అలాంటి ఆలోచనలో చేస్తారు. ట్రెండ్‌ని ఫాలో కావడం తప్ప క్రియేట్ చేయడం మన వారికి చేతకాదనే చెప్పాలి. ఇక ఇప్పటికే స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌గా బాలయ్యాస్ ఎన్టీఆర్ బయోపిక్‌ని తేజ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. అయితే అనుకోని విధంగా వర్మ లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలను చూపిస్తూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని తీస్తున్నానని చెప్పి ప్రీలుక్ పోస్టర్‌ని కూడా వదిలాడు.
దాంతో గతంలో సెన్సార్‌బోర్డ్ చైర్మన్‌గా, తమిళనాడు తెలుగు వారి నాయకుడిగా పేరున్న కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తాజాగా లక్ష్మీపార్వతి, ఆమె మొదటిభర్త వీరగంధం సుబ్బారావుల వైవాహిక జీవితం, వీరిద్దరు విడిపోయిన కారణాలు, లక్ష్మీపార్వతి తన మొదటి భర్తని వదిలేసి ఎన్టీఆర్‌ని వివాహం చేసుకోవడం అనే అంశాల మీద 'లక్ష్మీస్ వీరగంధం' అనే చిత్రాన్ని అనౌన్స్ చేసి ఫస్ట్‌లుక్‌ని కూడా వదిలాడు. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తే ఇది 'సావిత్రి, శ్రీదేవి' అంటూ వర్మ వదిలిన పోస్టర్స్‌లానే ఉంది. ఈ లుక్‌పై వర్మ తన ఫేస్‌బుక్ ఖాతాలో కామెంట్ చేస్తూ ఈ పోస్టర్‌లో ఉన్నది ఏ మహిళో తెలియదు. కానీ ఆమె వీపు మాత్రం సూపర్.. అంటూ వ్యగ్యాత్మకంగా స్పందించాడు.
వాస్తవానికి ఎన్టీఆర్ జీవితం, లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాతి సంఘటనలు చూచాయగా అయినా తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. కానీ లక్ష్మీపార్వతి మొదటి భర్త, వారి మధ్య వచ్చిన విబేధాలు వంటి ఆమె మొదటి కుటుంబ వ్యవహారాలు మాత్రం ప్రేక్షకులకి పెద్దగా తెలియదు. దాంతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తీస్తే మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. మొత్తానికి బాలయ్య, వర్మలు కదిపిన తేనెతుట్టే ఇప్పుడు 'లక్ష్మీస్ వీరగంధం'తో పీక్స్‌కి వెళ్లిందనే చెప్పాలి.