తెలుగులో వెంకటేష్, చిరంజీవి, పవన్‌కళ్యాణ్, బాలకృష్ణ, ప్రభాస్, మహేష్‌బాబు వంటి స్టార్స్ అందరితో సినిమా తీసిన దర్శకుడు జయంత్.సి.పరాన్జీ. ఆయన తీసిన చిత్రాలలో ఎక్కువ శాతం హిట్స్‌గానే నిలిచాయి. కానీ ఆయన ఆర్ధికంగా నష్టపోవడం కూడా జరిగింది. మహేష్‌బాబుకి ఎంతో ఆప్తుడైన ఈయన తన స్వీయనిర్మాణంలో 'టక్కరిదొంగ' చిత్రం తీసి మహేష్‌ని ఆయనతండ్రి కృష్ణ తరహాలోనే కౌబోయ్‌గా చూపించాలనుకుని దెబ్బతిన్నాడు. ఇక ప్రభాస్‌ని 'ఈశ్వర్' ద్వారా పరిచయం చేసింది కూడా ఈయనే. ఇక ఆయన కెరీర్‌లో మహేష్ తో 'టక్కరిదొంగ', పవన్‌కళ్యాణ్ 'తీన్‌మార్' వంటి చిత్రాలతో పాటు ఆయన చాలా లాంగ్ గ్యాప్ తర్వాత గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితో తీసిన 'జయదేవ్' కూడా డిజాస్టర్ అయింది.
కాగా పవన్ కెరీర్‌లో ఈయన తీసిన 'తీన్‌మార్' ఒక పెద్ద డిజాస్టర్. ఈ చిత్రం బాలీవుడ్ రీమేక్ కావడం, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేయడంతో ఈ చిత్రంపై పవన్ అభిమానులు భారీగానే ఆశలుపెట్టుకున్నారు. ఇక ఈచిత్రం గురించి తాజాగా జయంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ, అంతకు ముందు నేను తీసిన 'సామి' రీమేక్ అయిన బాలకృష్ణ 'లక్ష్మీనరసింహ', 'మున్నాభాయ్ ఎంబిబిఎస్'కి రీమేక్‌గా చిరంజీవితో చేసిన 'శంకర్ దాదా ఎంబిబిఎస్' చిత్రాలు రీమేక్స్ అయినా బాగా ఆడాయి. అవి రీమేక్‌లైనా సరే ఉన్నది ఉన్నట్లుగా తీయకుండా తెలుగుకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేశాం. కానీ 'తీన్‌మార్'ని ఉన్నది ఉన్నట్లుగా తీయాల్సివచ్చింది. దాంతో ఈచిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ చిత్రం తీసేటప్పుడే నాకు ఆడదని అర్ధమైపోయింది. అయినా తీయాల్సి వచ్చింది. దాంతో మరోసారి రీమేక్ చేయకూడదని భావించి నాడే స్టేట్‌మెంట్ ఇచ్చాను అని తెలిపాడు.
అయితే 'తీన్‌మార్' రీమేక్‌ని ఎందుకు ఉన్నది ఉన్నట్లు తీయాల్సి వచ్చింది? దీని వెనుక ఎవరిదైనా బలవంతం ఉందా? అనే విషయాలను మాత్రం ఆయన చెప్పలేదు. బహుశా పవన్ ఆదేశాల మేరకే ఉన్నది ఉన్నట్లుగా తీయాల్సి వచ్చిందేమో అనే అనుమానం కలుగుతోంది.