పోయిన ఎన్నికల ముందు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆయన మాత్రమే రాజధానిని నిర్మించి, అభివృద్ది చేయగలడని ప్రజలు భావించారు. అందుకే గెలిపించారు. కానీ ఎన్నికలు జరిగి నాలుగేళ్లయినా బాబు వస్తే జాబు వస్తుంది అన్నచందానే బాబు వస్తే సుందర రాజధాని వస్తుందనేది కూడా నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిపోయింది. రాజధాని విషయంలో చంద్రబాబు నిలకడ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. స్విస్ చాలెంజ్ అంటాడు.. జపాన్‌ని, మలేషియాని, సింగపూర్‌ని ఆదర్శం అంటాడు. మన రాజధానిని కూడా అలాగే మారుస్తానని చెబుతూ వచ్చాడు. బహుశా అమరావతిలో ఓ నాలుగైదు మంచి నిర్మాణాలు చేసి దానికే అమరావతి అనే పేరు బదులు సింగపూర్ అనో మలేషియా అనో నామకరణం చేసేస్తే అది సింగపూర్, మలేషియా అయిపోతాయని ఆయనపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. కేవలం రాజధాని నిర్మాణం కోసమని ఈయన పార్టీ వారు, స్వయంగా ఆయన కూడా విదేశాలు ఎన్నిసార్లు ప్రజల సొమ్ముతో తిరిగి వచ్చారో అందరికీ తెలుసు. అయినా అమరావతికి ఒక రూపు వచ్చిందా? అంటే అదీ లేదు. అసలు రాజధాని ఎంపిక కేవలం తమ పార్టీ వారికి, తమ సామాజిక వర్గం వారికి మేలు చేయడానికే తప్ప ప్రజల కోసం కాదామో అనే సందేహాలు వస్తున్నాయి.
కృష్ణా, గుంటూరు జిల్లాలోని తన సామాజిక వర్గం వారికి లాభం చేకూర్చేందుకు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అమెరికాకో, దుబాయ్‌కో వెళ్లి మన యువత అన్నింటిలోనూ సూపర్‌అని, తన వల్లనే ఐటీ, నాలెడ్జ్ ఎకానమి బాగా వృద్ది చెందిందనిచెప్పే ఆయన మన రాష్ట్రంలో, దేశంలో రాజధానికి నమూనాలు, ఇతర ఆకృతులు తయారు చేయడం మన యువతకు చేతకాదా? అదే మనవారికే ఇచ్చి ఉంటే కాస్తైనా మన ఆర్కిటెక్టర్లకి పని, పేరు రెండూ వచ్చేవికదా...! ఎంతసేపు పొరుగింటిపుల్లకూర రుచి అన్నట్లుగా అమరావతికి రాజమౌళి వంటి వారు ఏమిచేయగలరు? రాజధాని అంటే అది సినిమా సెట్టింగ్ కాదు. ఇప్పటికే అక్కడి చిత్తడినేల వల్ల ఏడాదికి నాలుగైదు పంటలు పండించుకునే బంగారు భూమిని నాశనం చేశారు. ఇక చినుకు పడితే చిత్తడైపోయే నిర్మాణాలు జరుపుతున్నారు. తాత్కాలికి అసెంబ్లీలంటూ, ఇతర శాఖలకు అనవసరంగా తాత్కాలికం అని ముసుగేసి కోట్లకు కోట్లు ప్రజల ధనాన్ని వృధా చేస్తున్నారు.
ఇదే విషయమై ఏపీ ప్రభుత్వం మాజీ ప్రదాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు కూడా ప్రభుత్వాన్ని దుయ్యబట్టాడు. స్విస్‌చాలెంజ్ లోపభూయిష్టమని, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే రాజధాని విషయంలో అవాంతరాలు ఎదురవుతున్నాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంటే సినిమా సెట్టింగ్ కాదని, రాజధాని నిర్మాణానికి సినీ దర్శకులతో పనేంటి? అమరావతి నిర్మాణంలో తేడాలోస్తే ప్రజలే అంతిమంగా నష్టపోతారని, ప్రజలకు ఏది అవసరమో అది తెలుసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఆయన మాటలు నిజమే అయినా అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ఇప్పుడు పదవి పోయిన తర్వాత మరో విధంగా మాట్లాడుతున్న కృష్ణారావు వ్యాఖ్యలు రాజకీయంగా ఉన్నాయి తప్పితే వాటిని ప్రజల మనోభావాలుగా చూడలేకపోతున్నాం. అయినా రాజధాని విషయంలో ఆయన చెప్పిన మాటలు మాత్రం నిజమేనని ఒప్పుకోవాలి..!