సాధారణంగా సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగాలని అభిమానులు, సామాన్యులు పోటీ పడుతూ ఉంటారు. తమ అభిమాన హీరోలతో ఫొటోలు తీసుకుని వాటిని గర్వంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కానీ ఒక సుప్రసిద్ద రచయిత చెప్పినట్లు 'మనిషిని కుక్క కరిస్తే అది న్యూస్ కాదు... మనిషే కుక్కను కరిస్తే అది న్యూస్' అన్నది వాస్తవం. ఇక పవన్ కళ్యాణ్ తో సెల్ఫీలు దిగాలని ఆయన అభిమానులే కాదు అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం జనసేన పార్టీ పటిష్టత, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, జనసైనికులను పెంచుకోవడం వంటి వాటిపై పవన్ దృష్టి పెట్టాడు. తనకు పార్టీ స్థాపనలో, 'ఇజం' పుస్తక రచనలో సహకరించిన రాజు రవితేజను ఆయన మరలా చేరదీశాడు.
ఇప్పుడు ఆయన ఓ జనసేన సైనికునితో తానే స్వయంగా ఓ సెల్ఫీ దిగి ఆశ్చర్యపరిచాడు. 'సామాజిక, ఆర్థిక పరివర్తన కోసం నిరంతరం పనిచేసే, అలుపెరుగని కార్యకర్త మా నిమ్మల వీరన్న'తో అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం పార్టీ సభ్యత్వం విషయంలో పవన్ బిజీగా ఉన్నాడు. కానీ చిరంజీవిలాగానే పవన్‌ది కూడా చంచల మనస్తత్వం అని, ఆయన మూడ్‌ని బట్టి ఏది అనిపిస్తే ఆయన చేస్తాడని కొందరు అంటారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కూడా అందులో ఓ దళిత ఇచ్చిన ఉపన్యాసం విని, ఆమెకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం సీటుని ఇచ్చేశాడు.
కానీ ఆమె గెలుపుకు ఆయన ఏమాత్రం కృషి చేయలేదు. దాంతో ఆమె ఆర్ధికంగా అందరు బలవంతులు ఉన్న చోట తనని నిలబెట్టారని, కనీసం చిరు తమ నియోజకవర్గంలో ప్రచారమైనా చేయాలని వేడుకున్నా చిరు పట్టించుకోకపోవడంతో ఆమెకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక తనకు అండగా నిలిచిన రాజు రవితేజ విషయంలో కూడా కొంత కాలం దూరంగా పెట్టడం, కొంతకాలం చేరదీయం... ఇలా ఏదనిపిస్తే అది చేస్తున్నాడు. కానీ ఆయనకు మంచి సలహాలను ఇవ్వగలిగిన మేధావులను మాత్రం ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ నిమ్మల వీరన్ననైనా తనతో ఎల్లకాలం సాగనిస్తాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది!