నాగార్జున ఎందరో టాలెంటెడ్ దర్శకులను తెలుగు తెరకి పరిచయం చేశాడు. వారిలో కళ్యాణ్‌కృష్ణ కోసూరి ఒకరు. ఆయన తన తొలి చిత్రంగా 'సోగ్గాడే చిన్నినాయనా' తీసి సంక్రాంతికి పెద్ద పోటీలో నాగ్‌కి బ్లాక్‌బస్టర్ ఇవ్వడమే కాదు.. ఏయన్నార్, శోభన్‌బాబుల తర్వాత తెలుగు తెరకి నాగార్జుననే 'సోగ్గాడు' అని నిరూపించాడు. ఆడవారి వాసనలో పడిపోయే పల్లెటూరి సోగ్గాడు 'బంగార్రాజు' గా 'వాడి తస్సాదియ్యా' అంటూ నాగ్ ఈ చిత్రంలో మరిచిపోలేని, తాను మాత్రమే చేయగలిగిన పాత్రను చేశాడు. దాంతో కళ్యాణ్‌కృష్ణకు తన తదుపరి చిత్రంగా తన పెద్దకుమారుడు నాగచైతన్యతో 'రారండోయ్ వేడుక చూద్దాం' అనే సినిమాని ఇచ్చాడు.
ఈ చిత్రంతో నాగచైతన్య కెరీర్‌లోనే పెద్ద హిట్‌ని కళ్యాణ్‌కృష్ణ ఇచ్చాడు. ఇక 'సోగ్గాడే చిన్నినాయనా' కు ప్రీక్వెల్‌గా ఆయన 'బంగార్రాజు' అనే కథను సిద్దం చేసుకున్నాడు. మొదట్లో ఈ చిత్రంలో నటిస్తున్నానని చెప్పిన నాగ్ తాజాగా ప్రస్తుతం ఈ చిత్రం లేదని చెప్పాడు. అంతలో కళ్యాణ్‌కృష్ణ రవితేజకి కథ చెప్పడం కోసం వెళ్లాడు. దాంతో మీడియా అంతా 'బంగార్రాజు' పాత్రను రవితేజ చేయనున్నాడని, నాగ్ పాత్రకు కాస్త మార్పులు చేర్పులు చేసి రవితేజకి వినిపించాడని వార్తలు వచ్చాయి. కానీ కళ్యాణ్‌కృష్ణ ఇవ్వన్నీ ఉత్తి పుకార్లేనని తేల్చేశాడు. 'బంగార్రాజు' అంటే నాగార్జుననే. దానిలో ఎవ్వరిని ఊహించలేం.
ఒక వెర్షన్ రాస్తే నాగ్‌సార్‌కి నచ్చలేదు. ప్రస్తుతం 'బంగార్రాజు' కి మరో వెర్షన్ రాస్తున్నాను. రవితేజకి స్టోరీ చెప్పిన మాట నిజమే. కానీ అది 'బంగార్రాజు' కథ కాదు. వేరే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనింగ్ కథ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈయన దర్శకత్వంలో నిజజీవితంలో మేనమామ-మేనల్లుళ్లు అయిన వెంకటేష్, నాగచైతన్యలతో ఓ మల్టీస్టారర్ రూపొందనుందని, ఈ చిత్రంలో కూడా వెంకీ, చైతులు మామా అల్లుళ్లుగానే కనిపిస్తారని సమాచారం. మరి ఈ మూడు చిత్రాలలో కళ్యాణ్‌కృష్ణ నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా ఏది సెట్ అవుతుందో చూడాలి...!